Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెడుతోంది: స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి

  • అమ‌రావ‌తిలో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రాష్ట్ర స్థాయి స‌ద‌స్సు
  • ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌రైన వెంక‌ట్రామిరెడ్డి
  • గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీ ఇబ్బంది పెట్టింద‌ని ఆరోప‌ణ‌
  • ఇప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్య‌
  • కొంద‌రు జ‌డ్జీలు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆరోప‌ణ‌
ap secretariat employees association chairman venkatramireddy comments on ap high court

ఏపీ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను చర్చించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

శుక్ర‌వారం అమ‌రావ‌తిలో రాష్ట్ర గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా వెంక‌ట్రామిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న హైకోర్టు వ్య‌వ‌హార శైలిని ప్ర‌శ్నిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో ఎస్ఈసీ లాంటి రాజ్యాంగ సంస్థ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టాయని ఆరోపించిన వెంక‌ట్రామిరెడ్డి.. ఇటీవ‌ల కోర్టులు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. హైకోర్టులోని కొంద‌రు జ‌డ్జీలు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న ఆయ‌న‌... హైకోర్టు వ్య‌వ‌హార శైలిపై న్యాయ నిపుణులే విమ‌ర్శ‌లు చేశారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా హైకోర్టు వ్య‌వ‌హ‌రిస్తోందన్న వెంక‌ట్రామిరెడ్డి... న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను మ‌న‌మంతా చర్చించుకోవాలని పిలుపునిచ్చారు. హైకోర్టు జ‌డ్జీల‌ను దూషించిన కేసులో నిందితుల‌కు 3 నెల‌లైనా బెయిల్ రాలేదన్న ఆయ‌న‌... సీఎం జ‌గ‌న్‌ను గ‌తంలో ఒక‌రు దూషిస్తే... అత‌డికి కేవ‌లం గంట‌లో బెయిల్ ఇచ్చారన్నారు. జ‌డ్జీలు ప్ర‌భుత్వంపై ఏది ప‌డితే అది మాట్లాడ‌కుండా హుందాగా ఉండాలని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

సెప్టెంబ‌ర్‌ లేదంటే అక్టోబ‌ర్‌లో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రాష్ట్రస్థాయి స‌భ ఉంటుంద‌ని వెంక‌ట్రామిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు కాపాడుకోవాల‌ని కూడా ఆయ‌న ఉద్యోగుల‌కు పిలుపునిచ్చారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌మ వంతుగా కృషి చేస్తామ‌ని వెంక‌ట్రామిరెడ్డి తెలిపారు.

More Telugu News