Dieting: డైటింగ్‌ ఏదైనా ఈ ఏడూ పాటిస్తే బెటర్‌.. వైద్య నిపుణుల సూచనలివీ!

  • జంక్‌, ఫ్యాటీ ఫుడ్స్‌ తో ఊబకాయం, మధుమేహం సమస్యలు
  • బరువు తగ్గడానికి వివిధ డైటింగ్‌ పద్ధతులను ఆశ్రయిస్తున్న ప్రజలు
  • రోజూ ఒకే వేళకు తినడం, చక్కెరకు దూరంగా ఉండటం.. మేలంటున్న నిపుణులు
Any dieting is better if you follow these seven ideas experts suggest

ఇటీవలికాలంలో జంక్‌ ఫుడ్‌, కూల్‌ డ్రింకుల వంటి అలవాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తరచూ ఏదో ఒకటి తింటుండటం, ఒక్కోసారి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఎక్కువైంది. దీనితో శరీరం బరువు పెరిగిపోవడం, ఊబకాయం కారణంగా మధుమేహం, గుండె జబ్బులు వంటి వస్తుండటం సమస్యగా మారింది. 

ఈ క్రమంలో చాలా మంది బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఉపవాసం ఉండటం, ఆహారం పరిమాణం తగ్గించుకోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం సహా చాలా రకాల డైటింగ్‌ పద్ధతులను పాటిస్తున్నారు. వాకింగ్‌ మొదలు జిమ్‌ లలో కసరత్తుల దాకా వ్యాయామం చేస్తున్నారు. అయితే ఎన్ని రకాల డైటింగ్‌ పద్ధతులు పాటించినా.. ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా ఏడు ముఖ్యమైన అంశాలను పాటిస్తే.. డైటింగ్‌ ప్రయోజనం నెరవేరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే..

1. ఆహారం తీసుకునే సమయం
మీరు ఏం తింటున్నారన్న దానితోపాటు ఎప్పుడు తింటున్నారన్నది మీ శరీర బరువుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఎక్కువ సమయం పాటు ఆహారానికి విరామం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటలలోపు మాత్రమే ఆహారం తీసుకుంటే.. బరువు తగ్గాలన్న లక్ష్యం నెరవేరుతుందని పలు పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు

ప్రతి రోజులో ఏయే సమయాల్లో ఆహారం తీసుకుంటున్నారో.. రోజూ అదే సమయంలో తీసుకోవడం వల్ల శరీరంలో జీవ గడియారం బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి, బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు.

2. చక్కెర వినియోగాన్ని తగ్గించడం
రోజువారీ ఆహారంలో వీలైనంత వరకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చక్కెరలు ఎక్కువగా తీసుకుంటే.. అది వేగంగా రక్తంలో చేరుతుందని, రక్తంలో గ్లూకోజ్‌ ను తగ్గించే క్రమంలో శరీరం దాన్ని కొవ్వుగా మార్చుతుందని చెబుతున్నారు. అంటే బరువు తగ్గే లక్ష్యం నీరుగారిపోతుందని పేర్కొంటున్నారు.

3. తినే ఆహారంపైనే దృష్టి పెట్టండి
  టీవీ, సెల్ ఫోన్‌ చూస్తూనో, ఎవరితోనైనా మాట్లాడుతూనో ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా తినేసే అవకాశాలు చాలా ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తినే ఆహారంపైనే దృష్టి పెట్టి, ప్రతి ముద్దను ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా తీసుకోవడం వల్ల.. అవసరమైన మేరకే ఆహారం తీసుకుంటామని చాలా అధ్యయనాల్లో తేలిందని వివరిస్తున్నారు. మనం ఆహారాన్ని గమనిస్తూ తింటున్నప్పుడు.. శరీరానికి హానిచేసే ఫుడ్‌ కు దూరంగా ఉండాలన్న ధ్యాస కూడా కలుగుతుందని పేర్కొంటున్నారు.

4. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి
ఊబకాయంతో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలనుకున్నవారు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ వల్ల కడుపు త్వరగా నిండిన అనుభూతి కలుగుతుందని.. అదే సమయంలో శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయని వివరిస్తున్నారు. అంతేగాకుండా ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణ శక్తిని మెరుగుపర్చుతుందని.. దీనితో శరీరం యాక్టివ్‌ గా ఉండి ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

5. రాత్రిపూట తగిన నిద్ర ఉండేలా చూసుకోండి
మనం తీసుకునే ఆహారంలో పోషకాలకు, నిద్రకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరిగా ఆహారం తీసుకోనివారి, శరీరానికి తగిన శక్తిని ఇవ్వని ఆహారం తీసుకున్న వారికి నిద్రసరిగా పట్టదని స్పష్టం చేస్తున్నారు. అదే సరిగా నిద్రపోకపోతే ఆహారం సరిగా అరగదని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. ఎవరికైనా సరైన నిద్ర ఉంటే.. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని.. శరీరం యాక్టివ్ గా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

6. ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోండి
ఎవరైనా తీవ్ర ఒత్తిడిలో ఉంటే కేవలం వారి మానసిక ఆరోగ్యంపైనే కాకుండా శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురైతే.. అధికంగా తినడం, ఏది పడితే అది తినడం, వ్యాయామంపై నిర్లక్ష్యం వహించడం వంటివి చేస్తుంటారని గుర్తు చేస్తున్నారు. 

ఊబకాయంతో బాధపడుతున్న వారిపై చేసిన ఓ పరిశోధనలో ఒత్తిడిలో ఉండే వారు మరింతగా బరువు పెరుగుతున్నారని, ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోగలిగిన వారు బరువు తగ్గే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారని తేలిందని నిపుణులు వివరిస్తున్నారు. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. ఒత్తిడి, నిద్రలేమి వంటివి సమస్యాత్మకంగా మారుతాయని పేర్కొంటున్నారు.

7. చిన్న చిన్న లక్ష్యాలతో సుదీర్ఘ ప్రయోజనం
ఏదైనా కొత్త సంవత్సరం రాగానే.. లేదా పుట్టినరోజో, మరో యానివర్సరీనో రాగానే.. అన్ని కిలోలు బరువు తగ్గాలి, ఇన్ని కిలోలు తగ్గాలి అనుకుంటూ పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటుంటారు. కానీ అలా కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ, సాధిస్తూ వెళ్లడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి నాలుగైదు కిలోమీటర్లు నడవడం మొదలుపెట్టకుండా.. ముందు ఒక కిలోమీటర్ తో మొదలుపెట్టి మెల్లమెల్లగా దూరం పెంచుకుంటూ పోతే సులువుగా అనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News