Nitin Gadkari: నితిన్ గడ్కరీని బీజేపీ కీలక పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన శరద్ పవార్ పార్టీ

  • బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ తొలగింపు
  • బీజేపీ పెద్దలకు పోటీగా మారితే... వారి స్థాయిని తగ్గించేస్తారన్న ఎన్సీపీ
  • గడ్కరీ ఉన్నత స్థాయికి ఎదిగినందుకే తప్పించారని విమర్శ
Sharad Pawar party criticises BJP for dropping Nitin Gadkari from key post

బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి కూడా తప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 

గడ్కరీ చాలా తెలివైన నేత అని, ఆయన ఎదుగుదల ఇష్టం లేకే పార్లమెంటరీ బోర్డు నుంచి తీసేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో విమర్శించారు. నీ శక్తిసామర్థ్యాలు పెరిగితే, పార్టీలోని పెద్దలకు నీవు పోటీగా మారితే... బీజేపీ నీ స్థాయిని తగ్గించేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్ను తగ్గించి, కళంకితులను పై స్థాయికి తీసుకెళ్తుందని ఎద్దేవా చేశారు. గడ్కరీ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినందుకే ఆయనను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారని అన్నారు. 

ఇదిలావుంచితే, పార్టీలో జరగబోతున్న పరిణామాలను గడ్కరీ ముందే గ్రహించినట్టున్నారు. రాజకీయాలు ఇక చాలు అనిపిస్తోందని ఓ సందర్భంలో ఆయన అన్నారు. సామాజిక మార్పు కోసం పని చేసే వ్యవస్థగా కాకుండా... అధికారంలో ఉండేందుకే అన్నట్టుగా రాజకీయాలు తయారయ్యాయని వ్యాఖ్యానించారు.

More Telugu News