Team India: వచ్చే ఐదేళ్లలో టీమిండియాకు 141 అంతర్జాతీయ మ్యాచ్​లు

  • 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్
  • 2023- 2027 ఎఫ్ టీపీ విడుదల చేసిన ఐసీసీ 
  • భారత్ -పాకిస్థాన్‌ సిరీస్ కు దక్కని చోటు 
India to play 38 Tests 42 ODIs 61 T20Is in the FTP 2023 to 27

భారత పురుషుల క్రికెట్‌ జట్టు వచ్చే ఐదేళ్లు నిరంతర క్రికెట్ తో బిజీ బిజీగా ఉండనుంది. మూడు ఫార్మాట్లలో అనేక మ్యాచుల్లో ఆడనుంది. ఈ కాలంలో భారత్  141 ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోటీ పడనుంది. ఈ మేరకు ఐసీసీ ఐదేళ్ల ఫ్యూచర్‌ టూర్స్‌, ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)ని విడుదల చేసింది.

 2023 మే నుంచి 2027 ఏప్రిల్‌ వరకు ఉండే ఈ ఎఫ్‌టీలో భారత్ 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఎఫ్‌టీపీని పరిశీలిస్తే ఎక్కువగా వన్డేలు, టీ20ల పైనే దృష్టి పెట్టినట్టు అర్థం అవుతోంది. ద్వైపాక్షిక వన్డేల్లో కూడా ఎక్కువగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లే ఉన్నాయి. భారత్ ఇంత బిజీగా ఉన్నప్పటికీ వచ్చే ఐదేళ్లలో పాకిస్థాన్‌తో ఎలాంటి సిరీస్‌ ఆడటం లేదు. ఐసీసీ ఎఫ్‌టీపీలో భారత్- పాకిస్థాన్ సిరీస్ లకు చోటు దక్కలేదు. రాజకీయ కారణాల వల్ల పాక్ తో ఆడేందుకు భారత్ విముఖత చూపడమే ఇందుకు కారణం.

కాగా, ఎఫ్‌టీపీలో ఐసీసీలోని 12 సభ్య దేశాలు మొత్తం 777 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోటీ పడుతాయి. ఇందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు ఉన్నాయి.  ప్రస్తుత ఎఫ్‌టీపీ లో 694 మ్యాచ్‌లే ఉన్నాయి. రాబోయే రెండు ఎడిషన్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌, పలు ఐసీసీ ఈవెంట్లతో పాటు ద్వైపాక్షిక, త్రైపాక్షిక సిరీస్‌లను కూడా ఎఫ్‌టీపీలో చేర్చారు. 

ఇక, భారత్–ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో ఇకపై ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఆసీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదేసి టెస్టుల సిరీస్‌లో భారత్ పోటీ పడుతుంది. అలాగే, పలు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల్లోనూ పోటీపడుతుంది. రాబోయే ఎఫ్‌టీఏలో వెస్టిండీస్ (జులై–ఆగస్ట్‌ 2023) టూర్‌లో భారత్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడుతుంది. అలాగే, స్వదేశంలో జరిగే 2023 వన్డే వరల్డ్‌ కప్‌నకు ముందు భారత్ 27 వన్డేల్లో తలపడనుంది.

More Telugu News