Afghanistan: కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు.. 21 మంది మృతి!

  • తీవ్రంగా గాయపడిన మరో 40 మంది
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • మృతుల్లో మసీదు ఇమామ్ కూడా
  • ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఏడాది
At Least 21 Killed Many Wounded As Huge Blast in Kabul Mosque

బాంబు పేలుడుతో ఆఫ్ఘనిస్థాన్ మరోమారు రక్తమోడింది. ప్రార్థనలు జరుగుతున్న మసీదులో బాంబు పేలడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ఈ ఘటనలో కనీసం 21 మంది మరణించి ఉంటారని, మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. 

మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో మసీదు ఇమామ్ కూడా ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా పగిలినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ పేలుడు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పనేనని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసే సీనియర్ తాలిబన్ మత గురువు గత గురువారం కాబూల్‌లోని తన మదర్సాలో జరిగిన ఆత్మహుతి దాడిలో మరణించారు. ఆ ఘటన జరిగి వారం కూడా కాకుండానే ఇప్పుడు మసీదులో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News