Tarun Chugh: బీజేపీ అంటే కేసీఆర్ భయపడటానికి కారణం ఇదే: తరుణ్ ఛుగ్

  • కేసీఆర్ కు అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందన్న తరుణ్ 
  • త్వరలోనే తెలంగాణకు కేసీఆర్ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని వ్యాఖ్య 
  • రేపు కోరుట్లలో బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని వెల్లడి 
Tarun Chugh fires on KCR

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు బీజేపీదే అని ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మునుగోడులో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఆ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. రేపు 4 గంటలకు కోరుట్లలో బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని చెప్పారు. 

త్వరలోనే తెలంగాణకు కేసీఆర్ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని తరుణ్ ఛుగ్ అన్నారు. అవినీతి, వంశపారంపర్య రాజకీయాలే తెలంగాణకు శాపమని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లు, ఇందిరాగాంధీ మాదిరే కేసీఆర్ పాలన కూడా ఉందని విమర్శించారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పసలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... కేసీఆర్ ప్రసంగాలపై స్పందించడం అనవసరమని అన్నారు. 

కేసీఆర్ కు భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని... సొంత రాజ్యాంగాన్ని రచించాలనుకుంటున్నారని మండిపడ్డారు. అధికారాన్ని కోల్పోతామనే భయం కేసీఆర్ కు పట్టుకుందని... అందుకే బీజేపీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని చెప్పారు.

More Telugu News