WHO: మంకీ పాక్స్ పేరు మారుస్తాం.. కొత్త పేరు సూచించాలని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి

  • ఎప్పుడో కోతుల నుంచి సంక్రమించడంతో ఈ వైరస్ కు మంకీ పాక్స్ గా పేరు
  • ఇప్పుడు కోతులకు ఎలాంటి సంబంధం లేకుండా వ్యాపిస్తున్న వైనం
  • అవగాహన లేక పలు దేశాల్లో కోతులను కొట్టి చంపుతున్న జనం
  • ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ పేరు మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడి
Suggest new name for MonkeyPox asked WHO

కరోనా తర్వాత మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. ఆఫ్రికాలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత పెద్దగా ఇబ్బంది లేకున్నా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తర్వాత మంకీ పాక్స్ పేరు విషయంగా భిన్న వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ వైరస్ కు మరో పేరు సూచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విజ్ఞప్తి చేసింది. మరీ ఇబ్బందికరంగా లేకుండా.. ఆ వ్యాధిని గుర్తించగలిగే పేరు అయితే బాగుంటుందని సూచించింది.

మొదట్లో తగిన పేరే అయినా..
నిజానికి మొదట్లో కోతుల నుంచి మనుషులకు వ్యాపించడం వల్ల మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తికి, కోతులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదు. అది మనుషుల నుంచి మనుషులకు సోకుతోంది. అంతేగాకుండా మంకీ పాక్స్ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో బ్రెజిల్ వంటి పలు దేశాల్లో ప్రజలు అవగాహన లేక కోతులను కొట్టి చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అందువల్ల ఇప్పటికీ మంకీ పాక్స్ పేరుతో పిలవడం సరికాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఆరోగ్య శాఖ కూడా ఈ పేరు మార్చాలని పేర్కొంది. 

  • ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ పేరు మార్చాలని భావిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఫడెలా చైబ్ వెల్లడించారు. ‘‘మంకీ పాక్స్ వైరస్ అనే పేరు పలు ఇబ్బందులకు కారణమవుతోంది. ఎలాంటి తప్పుడు భావనరాని, ఇబ్బంది కలుగజేయని పేరును దానికి పెట్టాలని భావిస్తున్నాం. ఎవరైనా సరే https://icd.who.int/dev11 ద్వారా మంచి పేరును సూచించవచ్చు.. ” అని ఫడెలా చైబ్ ప్రకటించారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 31 వేలకుపైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో సగానికిపైగా యూరప్ దేశాల్లోనే రావడం గమనార్హం. 
  • ఇప్పటివరకు ఆఫ్రికా బయట అధికారికంగా 12 మంది ఈ వైరస్ బారినపడి చనిపోయినట్టు లెక్కలు ఉన్నాయి.

More Telugu News