Germany: ఈ కోడి బాధ పడలేకపోతున్నాం.. రోజుకు 200 సార్లు కూతపెడుతోందంటూ కోర్టుకెక్కిన వృద్ధ జంట!

  • జర్మనీలో ఓ కోడి పుంజుకు మాగ్డా అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్న మైఖేల్ అనేవ్యక్తి
  • బాగా యాక్టివ్ గా ఉండే ఆ కోడిపుంజుకు తరచూ కూతపెట్టే అలవాటు
  • దీని బాధ పడలేక కోర్టును ఆశ్రయించిన దంపతులు
German couple sick neighbours rooster crowing legal action removed

చాలా మందికి కోడి కూయనిదే పొద్దెక్కదు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కోడి కూతతో మేల్కొనే వాళ్లు ఎందరో. ఇక కోళ్లు మన చుట్టూ తిరుగుతునే ఉంటుంటాయి కూడా. కానీ జర్మనీలో ఓ వృద్ధ జంట మాత్రం ఓ కోడి తమకు నరకం చూపిస్తోందంటూ కోర్టుకు ఎక్కారు. పక్కింట్లోని కోడి రోజూ రెండు వందల సార్లకుపైగా బిగ్గరగా కూత పెడుతోందని.. అది భరించలేకపోతున్నామని.. దాన్ని వెంటనే ఎక్కడికైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్ని సార్లు కూత పెడుతోందో రాసి పెట్టుకుని మరీ..
  జర్మనీలోని వోర్సెస్టర్ నగరానికి చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఐదేళ్ల కిందట పెంచుకునేందుకు కొన్ని కోళ్లను తెచ్చుకున్నారు. అందులో ఓ కోడి పుంజు కూడా ఉంది. చాలా యాక్టివ్ గా ఉండే ఆ కోడి పుంజుకు మాగ్డా అని ముద్దుపేరు పెట్టుకుని పెంచుకుంటున్నాడు. అది నిత్యం కొక్కరకో అంటూ కూత పెడుతోంది. ఆ ఇంటి పక్కనే ఉండే 76 ఏళ్ల ఫ్రెడరిక్ విల్ హెం, ఆయన భార్య జుట్టాలకు మాత్రం ఈ కోడి కూత భరించలేని విధంగా తయారైంది. దీనిపై వాళ్లు మైఖేల్ కు చెప్పినా.. ఆ కోడి పుంజు లేకుంటే, కోడిపెట్టలు నియంత్రణ తప్పుతాయని, కోడి పుంజును ఎక్కడికీ తరలించేది లేదని స్పష్టం చేశాడు. ఇలా కొంతకాలం భరించిన ఫ్రెడరిక్, జుట్టా దంపతులు.. చివరికి కోర్టును ఆశ్రయించారు.

పొద్దున ఎనిమిదింటికి కూత మొదలు..
రోజూ రాత్రి కోళ్లను గూట్లోకి పంపే మైఖేల్.. మరునాడు పొద్దున 8 గంటలకు తన ఇంటి ఆవరణలోకి వదులుతాడు. అప్పటి నుంచి రాత్రిదాకా మాగ్డా కోడి పుంజు రెండు వందల సార్లు కూత పెడుతుందని ఫ్రెడరిక్ దంపతులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోడి పుంజు ఏ సమయంలో కూతపెడుతోందన్నది కొన్ని రోజుల పాటు రాసి పెట్టి మరీ.. దాన్ని కోర్టుకు ఇచ్చారు. ఈ కోళ్ల బాధ తట్టుకోలేక పొరుగిళ్లలో ఓ ఫ్యామిలీ ఖాళీ చేసి వెళ్లిపోయిందని వివరించారు.

‘‘ఇంటి ఆవరణలో కూర్చోలేకపోతున్నాం. కనీసం కిటికీలు కూడా తీసి పెట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా.. బిగ్గరగా కూత పెడుతూనే ఉంటుంది. ఆ కోడిని అక్కడి నుంచి తరలించాల్సిందే..” అని ఫ్రెడరిక్ పేర్కొన్నారు. 

దీనిపై వోర్సెస్టర్ నగర అధికారులు విచారణ ప్రారంభించారు. మైఖేల్ ఇంటి చుట్టుపక్కల వారిని అడిగితే.. తామంతా ఆ కోడి పుంజు వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. మైఖేల్ కు ఈ విషయం చాలా సార్లు చెప్పినా పట్టించుకోలేదని అధికారులకు తెలిపారు. ఫోన్లు మాట్లాడుకోలేకపోతున్నామని, జూమ్ మీటింగుల్లోనూ డిస్ట్రబెన్స్ గా ఉంటోందని ఫిర్యాదు చేశారు.

 వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు మైఖేల్ ను పిలిపించి.. అతడి కోళ్లను మరో చోటికి తరలించాల్సిందిగా ఆదేశించారు.

More Telugu News