Team India: భారత యువ క్రికెటర్​ ను దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్​ తో పోల్చిన రికీ పాంటింగ్

  • సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీ ప్లేయర్ అన్న పాంటింగ్
  • భారత జట్టులో అతడిని నాలుగో నంబర్ లో ఆడించాలని సూచన
  • టీ20 ప్రపంచకప్ జట్టులో సూర్య కచ్చితంగా ఉండాలన్న ఆస్ట్రేలియా దిగ్గజం 
Ricky Ponting compares Suryakumar Yadav with AB de Villiers

భారత యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ను ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటిగ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడిని దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తో పోల్చాడు. డివిలియర్స్ మాదిరిగా యాదవ్ కూడా 360 డిగ్రీల ఆటను కలిగి ఉన్నాడని చెప్పాడు. అలాగే, టీమిండియాలో సూర్యకుమార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని పాంటింగ్ సూచించాడు.

‘సూర్యకుమార్ మైదానం చుట్టూ 360 డిగ్రీల కోణంలో షాట్లు కొడతాడు. అతని ఆట చూస్తుంటే ఏబీ డివిలియర్స్ గుర్తొస్తాడు. ల్యాప్ షాట్లు, లేట్ కట్స్ పాటు కీపర్ తల మీదుగా ర్యాంప్‌ షాట్లు కూడా ఆడగలడు. అదే సమయంలో గ్రౌండ్ షాట్లు కూడా సమర్థవంతంగా కొట్టగలడు. లెగ్ సైడ్ మీదుగా బాగా ఆడగలడు. డీప్ బ్యాక్‌ వర్డ్ స్క్వేర్‌ మీదుగా అతను చేసే ఫ్లిక్స్ చూడముచ్చటగా ఉంటాయి. 

ఫాస్ట్ బౌలింగ్‌ తో పాటు స్పిన్ బౌలింగ్ లోనూ బాగా ఆడగల బ్యాటర్. సూర్యకుమార్ చాలా ఉత్తేజకరమైన ఆటగాడు. జట్టుతో పాటు తను కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. సూర్యకుమార్ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో కచ్చితంగా ఉంటాడని అనుకుంటున్నా. అతను జట్టులో ఉంటే, ఆస్ట్రేలియాలోని అభిమానులందరూ చాలా మంచి ఆటగాడిని చూడబోతున్నారని నేను భావిస్తున్నా’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. 

సూర్యకుమార్ ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అని పాంటింగ్ అన్నాడు. తన సత్తాపై అతనికి పూర్తి విశ్వాసం ఉండటంతో పాటు ఆటలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడని కొనియాడాడు. ఏ పరిస్థితిలో అయినా జట్టును గెలిపించనని సూర్యకుమార్ నమ్ముతాడని చెప్పాడు. భారత జట్టులో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే సత్తా సూర్య కుమార్ కు ఉందన్న పాంటింగ్ అతడిని నాలుగో నంబర్ లో ఆడించాలని సూచించడు.
 
కాగా, 31 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా ఆడిన 23 టీ20 మ్యాచ్‌ల్లో 37.33 సగటుతో 672 పరుగులు చేశాడు. అతను ఇప్పుడు ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

More Telugu News