Facebook: 'డ్రాకేరిస్' తో జాగ్రత్త... వాట్సాప్, యూట్యూబ్ లను మాయం చేస్తుంది: ఫేస్ బుక్ హెచ్చరిక

  • కొత్త మాల్వేర్ పై అప్రమత్తం చేసిన ఫేస్ బుక్
  • థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేయొద్దని సూచన
  • గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఉన్న యాప్ లనే ఇన్ స్టాల్ చేసుకోవాలని వెల్లడి
Facebook warns about new malware

యాప్ ల సాయంతో మాల్వేర్లను ఫోన్లలోకి ప్రవేశపెట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఒక్కసారి మాల్వేర్ చొరబడిందంటే ఆ ఫోన్ లోని సమాచారం అంతా తస్కరణకు గురవుతుంది. తాజాగా డ్రాకేరిస్ అనే మాల్వేర్ కూడా ఆండ్రాయిడ్ యూజర్ల పాలిట విలన్ లా పరిణమించిందంటూ ఫేస్ బుక్ హెచ్చరికలు చేసింది. ఈ మాల్వేర్ ఫోన్ లో ప్రవేశిస్తే వాట్సాప్, యూట్యూబ్ లను కనిపించకుండా మాయం చేస్తుందని వెల్లడించింది. నకిలీ, థర్డ్ పార్టీ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

ముఖ్యంగా, గేమింగ్ యాప్ ల సాయంతో డ్రాకేరిస్ మాల్వేర్ ను స్మార్ట్ ఫోన్లలోకి చొప్పిస్తున్నారని ఫేస్ బుక్ పేర్కొంది. ఈ మాల్వేర్ ఫోన్ లోని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను కూడా ఏమార్చగలదని వివరించింది. బిట్టర్ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్ సృష్టికర్త అని వెల్లడించింది. యూజర్ అనుమతి లేకుండానే ఫోన్ లో ఏమైనా చేసేందుకు ఈ డ్రాకేరిస్ మాల్వేర్ దోహదపడుతుందని వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రొటెక్షన్ ఉన్న యాప్ లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని, థర్డ్ పార్టీ ఏపీకే సైట్ల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

More Telugu News