Youtube: అమెజాన్​ ప్రైమ్​, హాట్​ స్టార్​ తరహాలో యూట్యూబ్​ స్ట్రీమింగ్​ సేవలు​!

  • ప్రస్తుతానికి ‘చానెల్ స్టోర్’ పేరుతో అంతర్గత పనులు
  • త్వరలోనే కొత్త ప్లాట్ ఫామ్ ను ప్రారంభించే అవకాశం ఉందంటున్న టెక్ వర్గాలు
  • స్ట్రీమింగ్ సర్వీసులకు ఆదరణ పెరుగుతుండటంతో ఆ దిశగా యూట్యూబ్ చూపు
Youtube plans to launch streaming video service

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల స్ట్రీమింగ్ సర్వీసులకు డిమాండ్ పెరిగిపోయింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వంటి సంస్థలు ఈ విభాగంలో దూసుకుపోతున్నాయి. కోట్లాది సబ్ స్క్రైబర్లతో ఆదాయాన్ని గడిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ కూడా ప్రత్యేక స్ట్రీమింగ్ సర్వీస్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతానికి ‘చానెల్ స్టోర్’ అనే అంతర్గత పేరుతో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంకు సంబంధించిన పనులు నడుస్తున్నాయని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ స్ట్రీమింగ్ సర్వీసులకు సంబంధించి గతంలోనే పలు ఎంటర్ టైన్ మెంట్ కంపెనీలతో యూట్యూబ్ చర్చించింది. తాజాగా మళ్లీ ఆ చర్చలను మొదలుపెట్టింది.

  • నిజానికి ప్రపంచవ్యాప్తంగా వీడియో కంటెంట్ కు సంబంధించి యూట్యూబ్ టాప్ లో ఉంటుంది. అయితే ఇందులో యూజర్లు ఎవరికి వారు అప్ లోడ్ చేసే వీడియోలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • యూట్యూబ్  సొంతంగా ఎలాంటి వీడియోలు, సినిమాలు, సిరీస్ లు వంటివి అందించదు.
  • యూట్యూబ్ లో డబ్బులు చెల్లించి కొత్త సినిమాలు చూసే అవకాశం ఉన్నా.. అది కేవలం ఒక్కోసినిమాకు ఇంత అని రేటు చెల్లించి చూడాలి. ఆ కంటెంట్ కూడా యూట్యూబ్ కొనుగోలు చేసినది కాదు. తమ ప్లాట్ ఫాంపై పెట్టినందుకు కొంత కమీషన్ మాత్రమే తీసుకుంటుంది. ఈ కంటెంట్ ఇతర వేదికలపైనా అందుబాటులో ఉంటుంది.
  • అదే స్ట్రీమింగ్ సర్వీసులు అయితే.. సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటివి కొనుగోలు చేయడంతోపాటు సొంతంగా నిర్మించడం ద్వారా తమ ప్లాట్ ఫాంలో పెడతాయి. ఇవి వాటి ప్లాట్ ఫామ్ లలో తప్ప మరెక్కడా అధికారికంగా అందుబాటులో ఉండవు. సదరు కంటెంట్ ను ఆయా ప్లాట్ ఫాంలపైనే చూడాల్సి ఉంటుంది.
  • ఈ నేపథ్యంలోనే సొంతంగా పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీసును తెచ్చేందుకు యూట్యూబ్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడే పని మొదలైందని.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర దాకా పట్టవచ్చని యూట్యూబ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

More Telugu News