Wizz Air: చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్​ పక్కన ఎయిర్​ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!

  • గ్రీస్ లోని స్కియతోస్ ద్వీపంలో బీచ్ పక్కనుంచే ఎయిర్ పోర్టు రన్ వే
  • అతి చిన్న రన్ కావడంతో మొదటి పాయింట్ లోనే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి
  • అంతంత పెద్ద విమానాలు తలపై నుంచి వెళ్లినట్టే ఉండటంతో పర్యాటకుల ఆసక్తి
Wizz Air passenger plane skimming just yards above tourists heads

మామూలుగా విమానం అంటేనే చాలా మందికి ఆసక్తి. ఎన్నిసార్లు విమానంలో ప్రయాణించినా.. ఆకాశంలో విమానం వెళుతుంటే తలపైకెత్తి చూస్తుంటాం. ఇక గాల్లో ఎగురుతున్న విమానాన్ని చాలా దగ్గరి నుంచి.. అదీ మనం చెయ్యి పైకి ఎత్తితే తగులుతుందేమో అన్నంత కింది నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఓ వైపు భయం కలిగించినా.. మరోవైపు ఆ ఉత్కంఠే వేరు అనిపిస్తుంటుంది. గ్రీస్‌లోని స్కియతోస్‌ ద్వీపానికి వెళితే మాత్రం ఈ అనుభూతిని స్వయంగా పొందవచ్చు.

చిన్న రన్ వే ఉండటంతో..
స్కియతోస్ ద్వీపంలోని ఎయిర్ పోర్టుకు సరైన స్థలం లేదు. బీచ్ సమీపంలో ఉన్న చదునైన స్థలంలోనే ఎయిర్ పోర్టును నిర్మించారు. కానీ దాని రన్ వే కేవలం ఒకటిన్నర కిలోమీటర్లే. అందువల్ల చాలా ముందుకు వచ్చి దిగడానికీ వీలుండదు. బీచ్ కు పక్కనే మొదలయ్యే.. రన్ వే ప్రారంభంలోనే విమానాలు ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ సాధారణమే కూడా. విమానాలు నేరుగా మన తలపై నుంచి ముందుకెళ్లి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న రన్ వేపై ల్యాండ్ అవుతూ ఉంటాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. 

ఇటీవల మరీ కిందుగా..   

  • విమానాలు బాగా కిందుగా వచ్చి ల్యాండ్ అవడం మామూలే అయినా.. ఆగస్టు 5న మాత్రం విజ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం అత్యంత దిగువగా వచ్చింది. రన్ వే ప్రారంభంలో ఉన్న ప్రహరీ గోడకు కేవలం కొన్ని అంగుళాలపై నుంచి దూసుకెళ్లి.. రన్ వేపై దిగింది. ఆ సమయంలో బీచ్ లో ఉన్న పర్యాటకులకు ఒక్కసారిగా గుండె ఝల్లుమంది.
  • ఒకరిద్దరు భయంతో పరుగు అందుకుంటే.. మరికొందరు తలకు తగులుతుందేమో అనిపించి కిందికి వంగారు. రన్ వేపై విమానం దిగినప్పుడు.. దాని ఇంజన్ల నుంచి అతి వేగంగా వచ్చే గాలి ధాటికి కొందరు కిందపడిపోయారు కూడా.
  • దీనికి సంబంధించి కొందరు ప్రయాణికులు దూరం దూరంగా, వేర్వేరుగా తీసిన వీడియోలను కలిపి ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
  • నిజానికి ఇక్కడ విమానాల ఇంజన్ల నుంచి వెలువడే గాలి ధాటికి ఎగిరిపడినవారు, గాయాల పాలైనవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయినా సందర్శకుల తాకిడి మాత్రం తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు.

More Telugu News