Spicejet: స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా ధూమపానం.. ఉపేక్షించబోమన్న విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

  • సీట్లపై పడుకుని లైటర్‌తో సిగరెట్ వెలిగించిన ప్రయాణికుడు
  • పాత వీడియోగా గుర్తింపు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ
  • మీడియా టీఆర్‌పీ కోసం ప్రయత్నిస్తోందంటూ ప్రయాణికుడి ఆగ్రహం 
Video of a man smoking on plane goes viral

స్పైస్‌జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు దర్జాగా సిగరెట్ తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అయింది. ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది. విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడిని గుర్గావ్‌కు చెందిన బాబీ కటారియాగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 6.30 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. 

అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం సీట్లపై పడుకుని కాలుపై కాలువేసుకుని లైటర్‌తో సిగరెట్ అంటించినట్టు స్పష్టంగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడి కారణంగా విమానంలోని ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు, ఈ వీడియోపై స్పందించిన పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దీనిపై విచారణ జరుగుతోందని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇది పాత వీడియో అని పౌరవిమానయానశాఖ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ కేసు నమోదైందని, చర్యలు తప్పవని పేర్కొంది. కాగా, నిందితుడు బాబీ కటారియా మాత్రం తనపై వచ్చిన వార్తల స్క్రీన్ షాట్లను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. టీఆర్‌పీ రేటింగుల కోసం మీడియా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, కటారియా గతంలో నడిరోడ్డుపై కూర్చుని మద్యం తాగినందుకు కేసు నమోదైంది.

More Telugu News