cycling: సైక్లింగ్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

  • బరువు తగ్గడానికి మంచి పరిష్కారం
  • ఒత్తిళ్లు, ఆందోళన తగ్గుతాయి
  • గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు
  • బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవచ్చు
6 Health benefits of cycling Weight loss to reduced anxiety

15-20 ఏళ్ల క్రితం ఎక్కడికైనా వెళ్లాలంటే చాలామంది చేతిలో సైకిల్ ఒక్కటే వాహనంగా ఉండేది. ద్విచక్ర మోటారు వాహనాలు (స్కూటర్లు, బైక్ లు) కొద్ది మందికే ఉండేవి. ఎక్కువ మంది సైకిల్ వినియోగించే వారు. కానీ, నేడు ఈ సైకిళ్లు అన్నవి చాలా వరకు తగ్గిపోయాయి. వీధి చివర పాల ప్యాకెట్ కు సైతం స్కూటర్ పై వెళ్లొచ్చే విధంగా రోజులు మారిపోయాయి. దీంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. దీని ఫలితమే ఎన్నో వ్యాధులు. జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్న కాలం కనుక సైకిల్ ను నమ్ముకోవాల్సిన రోజులు వచ్చేశాయి.

సైక్లింగ్ అన్నది ఎంతో సులభమైన వ్యాయామం. పైగా ఖర్చు లేనిది. సైకిల్ కొనుగోలుకు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు. జిమ్ మాదిరిగా ప్రతీ నెలా ఖర్చు ఉండదు. సైకిల్ తొక్కడంతో శరీరంలో అదనపు కొవ్వులు కరిగిపోతాయి. ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.

బరువు 
నిశ్చలమైన జీవన విధానమే బరువు పెరిగేందుకు కారణమని వైద్యులు చెబుతూ ఉంటారు. తక్కువ దూరాలకు నడిచి వెళ్లడం మంచి విధానం. అంత సమయం లేదని చెప్పి బైక్ బయటకు తీయకండి. కనీసం సైకిల్ తొక్కుకుంటూ అయినా వెళ్లి రావడం మంచిది. దీనివల్ల బరువు తగ్గించుకోవచ్చు. 45-60 నిమిషాల పాటు సైక్లింగ్ తో 300 కేలరీలు ఖర్చవుతాయి. 

జీవనశైలి వ్యాధులు
జీవనశైలి వ్యాధులుగా పరిగణించే మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులను సైక్లింగ్ తో దూరం పెట్టొచ్చు. మరీ ముఖ్యంగా రక్తపోటు, రక్తంలో గ్లూకోజు నియంత్రణకు సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే సైకిల్ తొక్కడం వల్ల మన శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు ఒత్తిడిని తీసేస్తాయి. ఇది అన్ని రకాల మంచి ఫలితాన్నిస్తుంది.

మానసిక ఆరోగ్యం
నిద్రపట్టని సమస్య ఎదుర్కొంటున్న వారు రోజులో ఒక గంట పాటు సైకిల్ తొక్కి చూడండి.. మంచి ఫలితం కనిపిస్తుంది. సైక్లింగ్ తో మంచి మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శరీరం పునరుజ్జీవనం చెందుతుంది. ఆందోళన, ఒత్తిళ్లు, మానసిక వ్యాకులత తగ్గుతాయి. సైక్లింగ్ చేసే వారు పట్టణాల్లోని రద్దీ ప్రదేశాలను ఎంపిక చేసుకోవద్దు. ట్రాఫిక్ లేని, పచ్చదనం ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి.

గుండెకూ మంచిదే
సైక్లింగ్ తొక్కడం అంటే కేవలం కేలరీలను, కొవ్వును కరిగించడం వరకే అనుకోవద్దు. తొడ కండరాలు బలోపేతం అవుతాయి. నిత్యం క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం వల్ల గుండె కండరాలు కూడా బలోపేతం అవుతాయి. సైక్లింగ్ కోసం మన శరీరం పడే శ్రమతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. సైక్లింగ్ సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శ్వాస ప్రక్రియ సాధనతో ఊపిరితిత్తులు బలపడతాయి. 

వ్యాధి నిరోధకత
వ్యాధి నిరోధక శక్తి లోపించడం నేడు కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి. తగినంత నిద్ర, పోషకాహారం లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. రోజువారీ సైకిల్ తొక్కడం వల్ల శారీరక సామర్థ్యం పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

More Telugu News