Bihar: నితీశ్ ఆడిన రాజకీయ క్రీడలో ఎక్కువ లాభ పడ్డది తేజస్వినే

  • వచ్చే ఎన్నికల్లో బీహార్ సీఎంగా తేజస్విని కోరుకుంటున్న ప్రజలు
  • ‘సి ఓటర్’ సర్వేలో  43 శాతం మంది మొగ్గు తేజస్వికే
  • మహిళలు, ఓబీసీ, ముస్లింల నుంచి తేజస్వికి మద్దతు
Popularity poll places Tejashwi Yadav ahead of CM Nitish Kumar

బీజేపీకి, ఎన్డీఏకు షాకిచ్చిన నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆడిన రాజకీయ క్రీడ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీని వీడిన నితీశ్ మళ్లీ మహాఘటబంధన్‌లోకి ప్రవేశించారు. అయితే బీహార్‌లో జరిగిన ఈ రాజకీయ తిరుగుబాటు వల్ల ఎక్కువ లాభపడింది మాత్రం ఆర్జేడీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అనే చెప్పాలి. ‘సి-ఓటర్’ నిర్వహించిన ఓపీనియన్ పోల్ లో ఈ విషయం వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్, బీజేపీ నాయకుల కంటే తేజస్వి యాదవ్ కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది.

 సి-ఓటర్ అభిప్రాయ సేకరణలో 43 శాతం మంది తదుపరి బీహార్ ముఖ్యమంత్రిగా తేజస్వి కావాలనుకుంటున్నారు. ఈ  సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 24 శాతం మంది మాత్రమే నితీశ్ కు మొగ్గు చూపారు. 19 శాతం మంది బీజేపీ నేతను బీహార్ సీఎంగా ఎంపిక చేశారు. బీహార్ లో మహిళలు కూడా తేజస్వి యాదవ్ తదుపరి సీఎం కావాలని కోరుకుంటున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో  44 శాతం మంది మహిళలు తేజస్విని తమ మొదటి ఎంపికగా భావించగా, 23.3 శాతం మంది మహిళలు మాత్రమే నితీశ్ ను ఎంచుకున్నారు. కేవలం 17.5 శాతం మంది బీజేపీ అభ్యర్థిని సీఎంగా కోరుకుంటున్నారు. 

కులాల ప్రాతిపదికన వస్తున్న పాప్యులారిటీ చూసినా కూడా నితీశ్ కంటే తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఓబీసీ కేటగిరీలో 44.6 శాతం మంది తేజస్వి యాదవ్‌కు అనుకూలంగా ఉండగా, నితీశ్ కుమార్‌కు 24.7 శాతం ఓట్లు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 12.4 శాతం మంది బీజేపీ సీఎంకి మొగ్గు చూపారు. తేజస్వి యాదవ్‌ను ముస్లిం సమాజం కూడా బహిరంగంగా ఆదరించింది. ప్రస్తుతం 54 శాతం మంది ముస్లింలు తేజస్వి యాదవ్‌ను మెరుగైన సీఎంగా భావిస్తుండగా, 30 శాతం మంది మాత్రమే నితీశ్ కు అనుకూలంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా సీఎం రేసులో తేజస్వి యాదవే ముందున్నారని సి- ఓటర్ సర్వే వెల్లడించింది.

More Telugu News