Pawan Kalyan: పారిస్ ఒలింపిక్స్ లో కూడా ఈ జైత్రయాత్ర కొనసాగాలి: పవన్ కల్యాణ్

  • కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పవన్ శుభాకాంక్షలు 
  • పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందని వ్యాఖ్య
  • మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం అందరికీ గర్వకారణమన్న జనసేనాని
Pawan Kalyan congratulates Paris Olympics winners

బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను మన క్రీడాకారులు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించిందని, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందని అన్నారు. ఈ విజయాలు క్రీడాభిమానులు, ఔత్సాహిక క్రీడాకారులలో నూతన ఉత్తేజాన్ని నింపాయనడంలో ఎలాంటి సందేహం లేదని, ముఖ్యంగా షటిల్ బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడలలో మన క్రీడాకారులు చూపిన ప్రతిభ ముచ్చటగొలిపిందని ఆయన పేర్కొన్నారు. 

"ఈ పోటీలలో మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ గర్వకారణం. విజేతలైన తెలుగు బిడ్డలు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్, సాత్విక్ సాయిరాజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మేఘన, రజని, హుస్సాబుద్దీన్, కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్ తో పాటు ఈ పోటీలలో పాల్గొన్న సుమిత్ రెడ్డి, జ్యోతిలకు తెలుగు ప్రభుత్వాలు ఉదారంగా నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ పోటీలలో మన క్రీడాకారులు విజయం సాధించడానికి వెన్నంటి ప్రోత్సహించిన కోచ్ లు, అధికారులకు అభినందనలు తెలుపుతున్నాను. 2024 లో పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలలో ఈ జైత్రయాత్ర కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.

More Telugu News