Jayasudha: ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం... బీజేపీలో చేరనున్న జయసుధ?

  • జయసుధతో ఈటల సంప్రదింపులు విజయవంతం
  • అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న జయసుధ
  • 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సహజనటి
Actor Jayasudha to join BJP

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ పార్టీల నేతలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లు కాంగ్రెస్ ను వీడారు. శ్రవణ్ బీజేపీలో ఇప్పటికే చేరిపోగా... అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడానికి కోమటిరెడ్డి సిద్ధమవుతున్నారు. 

మరోవైపు సినీ తారలు కూడా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ తో జయసుధ భేటీ అయ్యారు. ఆమెతో ఈటల కొన్ని రోజులుగా సంప్రదింపులు జరిపారు. ఈ నెల 21న అమిత్ షా మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమిత్ షా సమక్షంలో జయసుధ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. 

ప్రముఖ సినీ నటి విజయశాంతి ఇప్పటికే బీజేపీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు జయసుధ కూడా బీజేపీలో చేరితే... ఆ పార్టీ సినీ గ్లామర్ మరింత పెరుగుతుంది. 2009లో సికింద్రాబాబ్ నుంచి పోటీ చేసి, జయసుధ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి... 2016లో టీడీపీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధపై దృష్టి సారించిన బీజేపీ నేతలు చివరకు పార్టీలో చేరేలా ఆమెను ఒప్పించినట్టు చెబుతున్నారు. 

More Telugu News