Corona Virus: కరోనా సోకిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి లాంగ్​ కోవిడ్​ లక్షణాలు.. అధ్యయనంలో వెల్లడి

  • శ్వాసకోశ సమస్యలు, నీరసం, రుచి–వాసన శక్తి తగ్గిపోవడం వంటి ఇబ్బందులు
  • కనీసం ఒక లక్షణంతో సుదీర్ఘంగా బాధపడుతున్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు
  • నెదర్లాండ్స్ లో రెండేళ్లకుపైగా సుదీర్ఘంగా గ్రోనింజెన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
One in eight people got long covid after infection

రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ ప్రతాపం చూపుతోంది. మెల్లగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే చాలా మందిలో కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిలో ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని.. శ్వాసకోస సమస్యలు, నీరసం, రుచి, వాసన శక్తి తగ్గిపోవడం లక్షణాల్లో అన్నీగానీ, కనీసం ఒకట్రెండు గానీ చాలాకాలం కొనసాగుతున్నాయని అంటున్నారు. సుదీర్ఘంగా, విస్తృత స్థాయిలో జరిపిన అధ్యయనం.. కరోనాకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేల్లో సమగ్రమైనదని పేర్కొంటున్నారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

రెండేళ్లకుపైగా సుదీర్ఘ అధ్యయనం

  • 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు వరకు నెదర్లాండ్స్‌ దేశంలో 76,422 మంది కరోనా బాధితులకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. వారిలో కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలను సుదీర్ఘకాలం పరిశీలించారు.
  • రెండేళ్లకుపైగా సమయంలో 24 సార్లు వారి ఆరోగ్యాన్ని పరిశీలించి, పలు వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు లాంగ్ కోవిడ్ లక్షణాలతో  బాధపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన మొదటి ఐదు నెలల పాటు ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలతో ఇబ్బందిపడినట్టు అధ్యయనంలో వెల్లడించారు.
  • అయితే ఇలాంటి వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకడం లేదని తేలిందని.. వారిలో వైరల్ లోడ్ తక్కువగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని భావిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.
  • లాంగ్ కోవిడ్ గురించి ఇప్పటికే తెలిసినా.. దానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరిపాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రొనింజెన్‌ వర్సిటీ శాస్త్రవేత్త జుడిత్‌ రొస్ మిలెన్‌ పేర్కొన్నారు

More Telugu News