Team India: కామన్వెల్త్ క్రికెట్‌లో భారత్‌కు రజతం.. పోరాడి ఓడిన అమ్మాయిలు

  • భారత అమ్మాయిల స్ఫూర్తిదాయక ప్రదర్శన
  • కామన్వెల్త్ క్రికెట్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియా
  • కాంస్య పతకం దక్కించుకున్న న్యూజిలాండ్
Schutt and Gardner script comeback as Australia clinch gold

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల క్రికెట్ జట్టు దేశానికి రజత పతకాన్ని అందించింది. పసిడి పతకం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో చివరి వరకు పోరాడి ఓడింది. ఫలితంగా ‘రజతం’తో సరిపెట్టుకుంది. గత రాత్రి ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 152 పరుగులకు ఆలౌట్ అయింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 43 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 33 పరుగులు చేసింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డెనర్ 3, మెగాన్ షట్ రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మూనీ 41 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేయగా, కెప్టెన్ మెగ్ లానింగ్ 36, గార్డెనర్ 25, హేన్స్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, స్నేహ్ రాణాకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు స్వర్ణ పతకం దక్కగా, భారత్ రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు, ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

More Telugu News