CM Jagan: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ విద్యారంగ సంస్కరణలను వివరించిన సీఎం జగన్

  • మోదీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ సమావేశం
  • హాజరైన సీఎం జగన్
  • అమ్మ ఒడి, నాడు-నేడుపై వివరణ
  • విద్యా దీవెన, వసతి దీవెన పథకాల గురించి వెల్లడి
CM Jagan attends NITI AAYOG meeting in New Delhi and explains educational reforms in AP

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో విద్యారంగంలో తాము తీసుకువచ్చిన మార్పులను వివరించారు.

జగన్ ఏమన్నారంటే...

  • ఏపీలో అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. కుటుంబ పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరం కాకూడదన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం.
  • పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తున్నాం.
  • విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగ్ లు, నోటు బుక్స్, బూట్లు, మూడు జతల యూనిఫాం, ద్విభాషా టెక్ట్స్ పుస్తకాలు, ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తున్నాం.
  • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్, బైజూస్ యాప్ అందిస్తున్నాం.
  • నాడు-నేడు ద్వారా 55,555 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అందుకోసం రూ.17,900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
  • ఇప్పటికే మొదటి విడత కింద 15,715 పాఠశాలలను తీర్చిదిద్దాం. నాడు-నేడు మరో రెండు విడతలు నిర్వహిస్తాం.
  • విద్యా దీవెన ద్వారా వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నాం.
  • గడచిన మూడేళ్ల వ్యవధిలో దీని ద్వారా 21.56 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు.
  • హాస్టల్ విద్యార్థుల కోసం వసతి దీవెన ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నాం.
  • విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది.
  • పోటీ ప్రపంచంలో పిల్లలు ఒత్తిడికి లోనవకుండా 3వ తరగతి నుంచే సబ్జెక్టులవారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం.

అంతేగాకుండా, తమ విప్లవాత్మక వలంటీర్ విధానం తీరుతెన్నులను కూడా సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో వివంరించారు. ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించినట్టు వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు... 3,842 వార్డు సచివాలయాలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు గడప వద్దకే సేవలు అందిస్తున్నామని వివరించారు.

More Telugu News