TTD: రెండేళ్ల తర్వాత తొలిసారి మాడవీధుల్లో తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు

  • కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో లోపలే బ్రహ్మోత్సవాలు
  • సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ నిలిపివేత
  • సెప్టెంబరు 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Lord Srivari Brahmotsavalu to be held from september 27th

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆలయం లోపలే జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి తిరుమల మాడవీధుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి బ్రహ్మోత్సవాల సమయంలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకూ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే రూ. 300 టికెట్ దర్శనాన్ని రద్దు చేశారు.

వచ్చే నెల (సెప్టెంబరు) 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పెరటాసి మాసం కూడా ప్రారంభం కానుండడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం ఒకేసారి కల్పించాలంటే ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్న టీటీడీ సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీని నిలిపివేసింది.

More Telugu News