Dulquer Salmaan: మూవీ రివ్యూ: 'సీతా రామం'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'సీతా రామం'
  • అసలు కథ ట్రాక్ ఎక్కడంలో ఆలస్యం
  • నిదానంగా సాగుతూ వెళ్లే ఫస్టాఫ్
  • నిన్నటితరం కథ కావడంతో నిదానించిన కథనం 
  • సెకండాఫ్ బరువు పెంచిన హను రాఘవపూడి 
  •  విశ్రాంతి .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ లో థ్రిల్ చేసే ట్విస్టులు
  • విజువల్స్ పరంగా దృశ్య కావ్యమే
Sita Ramam Movie Review

హను రాఘవపూడి అనగానే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా కనిపిస్తాడు. ఆయన కథల్లో ఫీల్ ఉంటుంది.. ఆయన సన్నివేశాల్లో ఎమోషన్ ఉంటుంది .. ఆయన పాత్రల్లో సహజత్వం ఉంటుంది. చుట్టూ ఉన్న జీవితాల్లో నుంచే ఆయన తనకి కావలసిన కథలను తీస్తుంటాడు. అందువల్లనే అవి అందరి మనసులకు వెంటనే కనెక్ట్ అవుతుంటాయి. అలా ఆయన రూపొందించిన సినిమాగా 'సీతా రామం' కనిపిస్తుంది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్  - మృణాల్ ఠాకూర్ నాయకా నాయికలుగా నటించగా, రష్మిక .. ప్రకాశ్ రాజ్ .. సుమంత్ .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఈ కథ 1985లో లండన్ నగరంలో మొదలవుతుంది. పాకిస్థాన్ లో పుట్టిపెరిగిన అఫ్రీన్ (రష్మిక) లండన్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటుంది. తనకి అత్యవసరంగా కొంత డబ్బు అవసరం కావడంతో, తన తాతయ్య (సచిన్ ఖేడేకర్)ను అడగడం కోసం పాకిస్థాన్ వస్తుంది. అయితే అప్పటికే ఆయన చనిపోయి కొంతకాలమవుతుంది. పాక్ ఆర్మీ అధికారిగా పనిచేసిన ఆయన, తన పేరున ఆస్తి రాశాడేమోనని ఆమె అనుకుంటుంది. అయితే ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఒక ఉత్తరం 'సీతామహాలక్ష్మి' (మృణాళిని)కి అందజేయమనీ, అలా చేస్తేనే అఫ్రీన్ కి తన ఆస్తి దక్కుతుందని ఆయన విల్లు రాసినట్టుగా తెలుసుకుని షాక్ అవుతుంది.

అప్పటికి ఆ ఉత్తరం రాసి 20 ఏళ్లు అవుతుంది. రామ్ ఎవరో ఎక్కడున్నాడో తెలియదు .. సీతామహాలక్ష్మీ ఎవరో .. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఆధారంగా ఏ ఒక్కరి ఫొటో లేదు. ఎలా వాళ్లని గురించి కనుక్కోవడం అనే ఆలోచనలో పడుతుంది. రామ్ మద్రాస్ రెజిమెంట్ లో 1964లో పనిచేసినట్టుగా తెలుసుకున్న ఆమె, ఆయన వైపు నుంచి తెలుసుకుంటూ వెళితే ఫలితం ఉండొచ్చని భావించి తన ప్రయత్నాన్ని మొదలెడుతుంది. ఆ  ప్రయాణంలో ..  రామ్ - సీత అందమైన ప్రేమకథను గురించి తెలుసుకుంటూ వెళ్లిన అఫ్రీన్ కి, ఆ తరువాత తెలిసే అనూహ్యమైన నిజాలేమిటి? అనేదే కథ. 

ఈ కథ అటు 1960లలో..  ఇటు 1980లలో జరుగుతుంది. ఈ రెండు కాలాలకి సంబంధించిన వాతావరణాన్ని తెరపై చూపించడమనేది అంత తేలికైన విషయం కాదు. గోడ గడియారాలు .. ఫ్యాన్లు .. వెహికల్స్ .. ఫోన్లు .. కాస్ట్యూమ్స్ .. ఇలా ప్రతి విషయంలోను జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టమైన విషయం. దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ ను సాధించాడు. పాకిస్థాన్ లోని తీవ్రవాదులు అక్కడి నుంచి కొంతమంది కుర్రాళ్లను కశ్మీర్ కి పంపించి .. అక్కడ అల్లర్లు సృష్టించి .. ఇండియన్ ఆర్మీపై అక్కడి ముస్లిమ్స్ ద్వేషం పెంచుకునేలా ప్లాన్ చేయడంతో ఈ కథ మొదలవుతుంది. 

ఈ నేపథ్యంలోనే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథను తెరపై తీసుకురావడానికి దర్శకుడు కొంత సమయాన్ని  తీసుకున్నాడు. అప్పటివరకూ కాస్త అసహనంగా అనిపించినా, తెరపైకి హీరో హీరోయిన్లు ఇద్దరూ వచ్చిన తరువాత హమ్మయ్య అనుకోవడం జరుగుతుంది. అయితే ఇది 1964 నాటి ప్రేమకథ కావడం వలన ఇప్పటంతటి ఫాస్టుగా ఉండదు వ్యవహారం .. నిదానంగా నడుస్తూ ఉంటుంది. కథ మరీ స్లోగా అనిపించడానికి మరో కారణం దర్శకుడు ఫీల్ కోసం ట్రై చేయడంగా కూడా చెప్పుకోవాలి. 

ఈ కథ పండాలంటే కమ్యూనికేషన్స్ లేని కాలం కావాలి .. అందుకే 1960లలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత అంతగా  టెక్నాలజీ లేని రోజుల్లో అడ్రస్ లు వెతికి పట్టుకోవడంలోనే ఆడియన్స్ కి థ్రిల్ ఉంటుంది. అందువలన మిగతా కథ 1980లలో నడుస్తుంది. ఈ కాలాలే ఈ కథకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. కథ ఆ కాలంలో జరుగుతోంది అనే విషయంలో నుంచి ప్రేక్షకుడు జారిపోతే మాత్రం కథ చాలా నిదానంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తంగా చూసుకుంటే నాలుగు ట్విస్టులు కనిపిస్తాయి. నాలుగు కూడా ప్రేక్షకులు ఎంతమాత్రం ఊహించనివే.

నటీనటులంతా కూడా ఎవరి పాత్రకి తగినట్టుగా వారు నటించారు. అత్యంత ప్రధానమైన సీత పాత్ర కోసం మృణాల్ ను ఎందుకు తీసుకొచ్చారనేది మాత్రం అర్థం కాదు. అంత ప్రత్యేకత కూడా ఆమెలో ఏమీ కనిపించదు. సంగీతం విషయానికి వస్తే కథకి తగినట్టుగానే పాతకాలం నాటి ట్యూన్లనే విశాల్ చంద్రశేఖర్ సెట్ చేశాడు. ఎస్.పి. చరణ్ పాటలు మాత్రం బాలు పాడినట్టుగా అనిపిస్తాయి. 'ఓ సీతా' .. 'ఇంతందం .. ' అనే పాటలకి ఎక్కువ మార్కులు పడతాయి. విశాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. 

వినోద్ కెమెరా పనితనం బాగుంది. పాటలకు అందాన్నీ .. సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకుని వచ్చాడు. ఎడిటింగ్ పరంగా కోటగిరి వెంకటేశ్వరరావు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కాకపోతే కొన్ని సన్నివేశాలను దర్శకుడు పూర్తి క్లారిటీతో చెప్పడానికి ట్రై చేశాడు. ఎప్పుడూ కూడా సెకండాఫ్ సరిగ్గా తీయననే కామెంట్ తనపై ఉందనీ, ఈ సినిమా విషయంలో అలా జరగదని హను రాఘవపూడి చెప్పాడు. నిజంగానే ఆయన ఈ సారి సెకండాఫ్ పై గట్టిగానే దృష్టి పెట్టాడు .. కాకపోతే ఫస్టాఫ్ ను కూడా కాస్త పట్టించుకోవలసింది.

ఫస్టాఫ్ లో అసలు కథను తెరపైకి తీసుకుని రావడానికి ఆయన తీసుకున్న సమయం ఎక్కువ. ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాతగానీ .. ప్రేక్షకుడు సీట్లో కాస్త సర్దుకోడు. సినిమాలో బలంగా కనిపించే నాలుగు ట్విస్టులు కథను చాలా వరకూ బ్యాలెన్స్ చేస్తాయి. కాకపోతే అప్పటివరకూ ఎదురుచూసే ఓపిక ప్రేక్షకులకు ఉండాలి. పాటలు బాగానే అనిపించినప్పటికీ అప్పుడే అయిపోయాయా అంతవరకే రాయించారా? అనే విషయం అర్థంకాదు. కథ పరంగా చూసుకుంటే ఇది ప్రేమకథాకావ్యమే .. విజువల్స్ పరంగా చూసుకుంటే దృశ్య కావ్యమే. కానీ నిదానంగా సాగే నిన్నటితరం కథతో ఈ తరం ప్రేక్షకులను కూర్చోబెట్టడం .. కమర్షియల్ గా మెప్పించడం ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి.

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News