Sea Banana: అరటి పండు కాదు.. అదో సరికొత్త జీవి.. పసిఫిక్‌ సముద్రంలో చిత్రమైన జీవులను గుర్తించిన శాస్త్రవేత్తలు

  • ఓ వైపు తొక్క తీసిన అరటి పండులా ఉన్న సీ కుకుంబర్ (సముద్ర దోసకాయ)
  • పసిఫిక్ మహా సముద్రం అడుగున 5 కిలోమీటర్ల లోతులో పరిశోధన
  • తులిప్ పుష్పం ఆకృతిలో ఆకట్టుకునే సీ స్పాంజ్ సహా మరెన్నో చిత్రమైన జీవుల గుర్తింపు
This is not a banana It is a new creature Scientists found in the Pacific Ocean

పైన ఫొటోలో ఓ వైపు తొక్క తీసి పక్కన పెట్టిన అరటి పండులా కనిపిస్తోంది కదా.. అది అరటి పండో, మరేదో ప్లాస్టిక్ వస్తువో కాదు.. అది శాస్త్రవేత్తలు సరికొత్తగా గుర్తించిన సీ కుకుంబర్ జాతి జంతువు. లండన్ కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం (ఎన్ హెచ్ఎం) శాస్త్రవేత్తలు పసిఫిక్ మహా సముద్రం అడుగున ఈ జీవిని గుర్తించారు. 

సీ కుకుంబర్ జాతి జీవులు సాధారణమే అయినా.. అందులో సరికొత్త రకమైన దీన్ని గుర్తించడం ఇదే తొలిసారి. దీనికి శాస్త్రవేత్తలు ‘గమ్మీ స్వ్కిరెల్’ అని పేరు పెట్టారు. సన్నగా పొడుగ్గా పసుపు పచ్చ రంగులో ఉన్న ఈ జీవికి తోక ఆకారంలో పెద్ద టెంటకిల్ ఉంది. శరీరం దిగువన పెద్ద సంఖ్యలో కాళ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఫొటోలో చూడటానికి చిన్నగా కనిపిస్తోందిగానీ.. ఈ గమ్మీ స్వ్కిరల్ రెండు అడుగుల పొడవు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పెద్ద సంఖ్యలో కొత్త జీవులు
శాస్త్రవేత్తలు ఒక కేబుల్ సాయంతో సముద్రం అడుగు వరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీస్తూ పరిశోధన చేయగలిగే, అవసరమైతే శాంపిల్స్ సేకరించగలిగే ‘రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్ఓవీ) సాయంతో నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా తీరంలోని హవాయి నుంచి మెక్సికో మధ్య సగటున ఐదు కిలోమీటర్ల (16,400 అడుగుల) లోతున సముద్రపు నేలపై జీవులను పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత చిత్రమైన, ఎన్నడూ చూడని సరికొత్త జీవులను గుర్తించారు. వాటి జన్యుక్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కొన్ని జీవులు లక్షల ఏళ్లుగా పరిణామం చెందకుండా, అచ్చం వాటి పూర్వపు జీవులు ఉన్నట్టే ఉన్నాయని గుర్తించారు.

తులిప్ పుష్పం లాంటి సీ స్పాంజ్
    పసిఫిక్ సముద్రం అడుగున శాస్త్రవేత్తలు గుర్తించిన మరో చిత్రమైన జీవి ఇది. సముద్ర స్పాంజ్ ల జాతికి చెందిన ఈ జీవి తెలుపు రంగులో అచ్చం తులిప్ పుష్పం తరహాలో ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హ్యలోనెమా’ అని పేరు పెట్టారు. భూమి నుంచి ఓ కాడ పైకి ఎదిగి దానికి తులిప్ పుష్పం ఏర్పడినట్టే.. ఈ జీవి పొడవాటి కాడ వంటి నిర్మాణంతో సముద్రం అడుగున నేలకు అనుసంధానమై.. ప్రధాన భాగం నీటి మధ్యలో వేలాడుతున్నట్టుగా ఉండటం గమనార్హం.

More Telugu News