James Webb telescope: అంతరిక్షంలో విష్ణు చక్రం.. చిత్రమైన గెలాక్సీని గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు!

  • భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు
  • జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో పరిశీలించిన శాస్త్రవేత్తలు
  • ఓ పెద్ద గెలాక్సీ, మరో చిన్న గెలాక్సీ ఢీకొనడంతో ఈ ‘రింగ్’ గెలాక్సీ ఉద్భవించినట్టు వెల్లడి
James Webb captures stunning new image Cartwheel Galaxy

చక్రాన్ని ఆవిష్కరించడంతోనే మానవ నాగరికత వేగం పెరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు. నాటి పురాణాల నుంచి నేటి ఆధునిక యంత్రాల దాకా అన్నీ చక్రంతోనే ముడిపడి ఉన్నాయి. చక్రాన్ని కనిపెట్టిన కొత్తలో బండ్లు తయారు చేసి.. గుర్రాలు, ఎడ్లు, ఇతర జంతువులకు కట్టి రవాణా కోసం వాడేవారు. ఇప్పుడు సుదూర నక్షత్రాల గుట్టు తేల్చేందుకు అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను పంపగలిగే దశకు మనిషి చేరుకున్నాడు.

ఇప్పుడా టెలిస్కోప్ కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలోని నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలను మన కళ్లముందు ఉంచుతోంది. ఈ క్రమంలోనే సుదూర అంతరిక్షంలో ఓ అతి పెద్ద ‘చక్రం’ వంటి గెలక్సీని నాసా శాస్త్రవేత్తల ముందు పెట్టింది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌తో ఆకాశాన్ని జల్లెడ పడుతున్న శాస్త్రవేత్తలు.. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీని గుర్తించారు. దీనికి ‘కార్ట్ వీల్ (ఎడ్ల బండి చక్రం)’ అని పేరు పెట్టారు.

రెండు నక్షత్ర సమూహాలు ఢీకొనడంతో..

స్పైరల్ ఆకారంలో ఉండే ఓ పెద్ద గెలాక్సీ, మరో చిన్న గెలాక్సీ రెండూ వేగంగా ప్రయాణిస్తూ.. ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో కలిసిపోయి ఈ ‘వీల్ కార్ట్’ గెలాక్సీ ఏర్పడి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో మధ్యలో ఒక రింగ్, సుదూరంగా మరో రింగ్ లా నక్షత్రాలు, ఖగోళ పదార్థం చేరాయని.. ఆ రెండింటినీ అనుసంధానిస్తూ బండి చక్రం పుల్లల్లా ఖగోళ పదార్థాలు ఏర్పడ్డాయని వివరించారు. దీని బయటి రింగ్‌ లో కోట్ల సంఖ్యలో కొత్త నక్షత్రాలు పుడుతున్నాయని.. అప్పటికే ఉన్న నక్షత్రాలు పేలిపోతూ సూపర్ నోవాలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.

More Telugu News