IT: అమెరికాలో ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్ ఐటీ కంపెనీ.. త్వరలో ఇండియాలోనూ కోత ఉండొచ్చంటున్న ఐటీ వర్గాలు!

  • వంద కోట్ల డాలర్ల ఖర్చును తగ్గించుకునే లక్ష్యంతో ఒరాకిల్ చర్యలు
  • వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తీసివేత కొనసాగవచ్చంటున్న ఐటీ వర్గాలు
  • ఒరాకిల్ కు అమెరికా అవతల భారత్ లోనే అతిపెద్ద డెలివరీ సెంటర్
Tech giant oracle lays off employees in us and india may be hit

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోతను ప్రారంభించిందని.. అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాల కోత మొదలైందని ‘ది ఇన్ఫర్మేషన్’ టెక్నాలజీ మీడియా సంస్థ నివేదిక వెల్లడించింది. 

కంపెనీ మొత్తంగా వంద కోట్ల డాలర్ల (మన కరెన్సీలో సుమారు 7,900 కోట్ల రూపాయల) మేర ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వీడ్కోలు పలికేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. అంతగా కీలకం కాని విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఇప్పటికే మొదలైందని వెల్లడించింది.

ప్రతి టీమ్ నుంచి తీసివేతలు!
అమెరికాలోని ఆస్టిన్ లో ఉన్న ఒరాకిల్ ప్రధాన కార్యాలయంలో సీఎక్స్ ప్రీసేల్స్, మార్కెటింగ్ టీమ్ లలోని ఇంజనీర్లను ఇటీవల తొలగించిందని.. ఒక్కో టీమ్ లో ఏడుగురి నుంచి పది మంది వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని ప్రఖ్యాత వెబ్సైట్ ది రిజిస్టర్ పేర్కొంది. సీఎక్స్ కామర్స్ విభాగం నుంచి ఎక్కువ మందిని ఇంటికి పంపేసినట్టు తెలిపింది. అనలిస్ట్ రిలేషన్స్ నుంచి టాలెంట్ అక్విసిషన్, సీఆర్ఎం, డెవలపర్స్ దాకా.. కొత్తగా చేరినవారి నుంచి 20 ఏళ్ల సర్వీసు ఉన్నవారి దాకా.. అన్ని రకాల ఉద్యోగులు ఇందులో ఉన్నారని పేర్కొంది. చాలా మంది ఒరాకిల్ ఉద్యోగులు తమ లింక్ డ్ ఇన్ స్టేటస్ లో ‘ఓపెన్ టు వర్క్’ అని పెడుతున్నట్టు వెల్లడించింది.

‘‘ఒరాకిల్ తో తమ అనుబంధం తెగిపోయిన చాలా మంది జాబితాలో నేను కూడా చేరానని బాధతో చెబుతున్నాను. ఒరాకిల్ లో నాతో కలిసి పనిచేసిన, నాకు సహకరించిన అందరికీ రుణపడి ఉంటాను. ప్రొఫెషనల్ గా, వ్యక్తిగతంగా ఎదిగేందుకు ఇది మంచి సమయం..” అని ఒరాకిల్ మార్కెటింగ్ మేనేజర్ దేవ్రా ఫిలిప్స్ తన లింక్ డ్ ఇన్ స్టేటస్ లో పేర్కొన్నారు.

ఇండియాకు చెందిన ఉద్యోగులు కూడా..
ఒరాకిల్ నుంచి ఉద్వాసనకు గురైనట్టుగా చాలా మంది భారత ఉద్యోగులు కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ‘‘ఒరాకిల్ మార్కెటింగ్ క్లౌడ్ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుతో నాపైనా ప్రభావం పడింది. ఇన్నేళ్లుగా నా విధి నిర్వహణలో తోటి ఉద్యోగులు, మేనేజర్లు, వినియోగదారులతో మంచి సంబంధాలు నెరుపుతూ చాలా నేర్చుకున్నాను” అని ఒరాకిల్ హైదరాబాద్ సెంటర్ లో ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ వంశీ కృష్ణ పేర్కొన్నారు.

ఇదిలావుంచితే, ఒరాకిల్ సంస్థకు అమెరికా అవతల అతిపెద్ద డెలివరీ సెంటర్ ఇండియాలోనే ఉందని.. సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఇక్కడా ఉండవచ్చని పేర్కొంటున్నాయి.

More Telugu News