Candy: చాక్లెట్లు తింటే చాలు.. ఏటా రూ.61.2 లక్షల జీతం.. కెనడా కంపెనీ ఆఫర్!

  • చీఫ్ క్యాండీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆన్ లైన్ లో ప్రకటన
  • రోజూ చాక్లెట్లు, క్యాండీలను రుచిచూసి.. పిల్లలు, పెద్దలకు నచ్చుతాయో లేదో తేల్చడమే ఉద్యోగమని వెల్లడి
  • ఐదేళ్లు దాటిన పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చనే ఆప్షన్ తో జనం ఆసక్తి
Eat candies earn rs 61 lakh per year canada company offer

తియ్య తియ్యగా ఉండే చాక్లెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా చాక్లెట్ నోట్లో పడిందంటే గుటుక్కుమని మింగేస్తారు. ఇక కాడ్బరీస్ వంటి సంస్థలు చాక్లెట్లను ప్రమోట్ చేసే వీడియోలు చూస్తుంటే నోరు ఊరక మానదు. అలాంటిది చాక్లెట్లు తిని పెట్టడమే ఓ ఉద్యోగమైతే.. అదీ బోలెడన్ని డబ్బులు జీతంగా ఇస్తే.. భలేగా ఉంటుంది మరి. కెనడాకు చెందిన ‘క్యాండీ ఫన్ హౌజ్’ అనే చాక్లెట్ల కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చింది.
 
ఏడాదికి లక్ష కెనడా డాలర్లు ఇస్తామంటూ..
ఇటీవల కెనడాకు చెందిన క్యాండీ ఫన్‌ హౌస్‌ అనే సంస్థ చీఫ్ క్యాండీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆన్‌ లైన్‌ లో ఇచ్చిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. తాము తయారు చేసే వివిధ రకాల చాక్లెట్లు, క్యాండీలను టేస్ట్ చేసి అవి అందరికీ నచ్చుతాయో లేదో గుర్తించాలని.. ఏయే ఫ్లేవర్లు కలిపితే నచ్చుతాయో తేల్చాల్సి ఉంటుందని వెల్లడించింది. చాక్లెట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదో తనిఖీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏకంగా ఏడాదికి లక్ష కెనడా డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు 61.2 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ పెట్టింది. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చనే సరికి..

  • అసలే చాక్లెట్లు, క్యాండీలు తినే తీయని ఉద్యోగం, మరోవైపు భారీ జీతం ఇంకేం.. చాలా మంది ఈ ఉద్యోగంపై ఆసక్తి చూపిస్తున్నారు.
  • చిత్రం ఏమిటంటే.. ఐదేళ్ల వయసు దాటిన పిల్లలు కూడా తల్లిదండ్రుల అనుమతితో చీఫ్ క్యాండీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొనడం గమనార్హం.
  • కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో దీనికి అప్లై చేయించడం, అప్లికేషన్‌ నింపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ గా మారింది. 
  • అయితే ఈ ఉద్యోగంలో భాగంగా రోజుకు 117 చాక్లెట్లు తినాల్సి ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది తప్పు అని, అన్ని చాక్లెట్లు తినాల్సిన అవసరం ఉండదని కంపెనీ వివరణ ఇచ్చింది.

More Telugu News