Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్​ జట్టు చేజారిన స్వర్ణం

  • బ్యాడ్మింటన్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో రజతంతో సరి
  • ఫైనల్లో 1-3తో మలేసియా చేతిలో ఓడిన జట్టు
  • పీవీ సింధు తప్ప మిగతా షట్లర్లకు నిరాశ 
CWG 2022 India settle for silver in mixed team badminton event

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం గెలిచింది. మిక్స్ డ్ బ్యాడ్మింటన్ జట్టు రజత పతకం గెలిచింది. దాంతో, ఈ క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కి చేరుకుంది. భారత బ్యాడ్మింటన్‌ మిక్స్ డ్ టీమ్‌ గత కామన్వెల్త్ క్రీడల్లో గెలిచి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 1-3 తేడాతో మలేసియా చేతిలో పరాజయం పాలైంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఈ మ్యాచ్ లో మొదటిదైన పురుషుల డబుల్స్ లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి జంట ఓడింది. మలేసియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా, వూయి యిక్‌ ద్వయం 21-18, 21-15 తేడాతో చిరాగ్‌-సాత్విక్‌ జంటను ఓడించింది. అనంతరం మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 22-20, 21-17తో మలేసియా స్టార్‌ జిన్‌ వెయ్‌-గోహ్‌పై గెలిచి స్కోరు సమం చేసింది. కానీ, మూడోదైన పురుషుల సింగిల్స్ లో తెలుగు క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ నిరాశ పరిచాడు. జె యోంగ్‌  21-19,6-21,21-16తో శ్రీకాంత్ ను ఓడించడంతో మలేసియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఇక, మ్యాచ్ లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మహిళల డబుల్స్‌లో భారత యువ జోడీ త్రీసా జోలీ- -గాయత్రి గోపిచంద్‌ కూడా తేలిపోయింది. మలేసియా జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్  21-18,21-17తో భారత్‌ జంటను ఓడించింది. రాంతో, మలేసియా స్వర్ణం గెలుచుకోగా... భారత్ రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 13 పతకాలు ఉన్నాయి. అందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.

More Telugu News