YSRCP: భూ వివాదాల ప‌రిష్కారానికి మండ‌ల స్థాయిలో ట్రైబ్యున‌ళ్లు: ఏపీ సీఎం జ‌గ‌న్‌

  • ప్ర‌తి మండ‌లంలో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ట్రైబ్యున‌ళ్లు ఏర్పాటు చేయాల‌న్న జ‌గ‌న్‌
  • భూ వివాదాల పరిష్కారానికి అత్యుత్త‌మ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌ని ఆదేశం
  • స‌ర్వే స‌మ‌యంలో వివాదాల ప‌రిష్కారానికి మొబైల్ ట్రైబ్యున‌ళ్లు ఏర్పాటు చేయాల‌న్న సీఎం
  • స‌ర్వే పూర్తయ్యే నాటికి స‌చివాల‌యాల్లోనే రిజిస్ట్రేష‌న్ జ‌రిగేలా చూడాల‌ని సూచ‌న‌
ap cm ys jagan orders to establish mandal level tribunals to clear the land issues

ఏపీలో భూ వివాదాల ప‌రిష్కారానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే స‌మ‌గ్ర స‌ర్వే పేరిట భూ వివాదాల ప‌రిష్కారం, భూ య‌జ‌మానుల‌కు చ‌ట్ట‌ప‌రంగా ర‌క్ష‌ణ‌కు శ్రీకారం చుట్టిన సీఎం‌... తాజాగా భూ వివాదాల ప‌రిష్కారం కోసం మండ‌ల స్థాయుల్లో శాశ్వ‌త ప్రాతిపదిక‌న ట్రైబ్యున‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప‌లు శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న 'జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం'పై స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న ట్రైబ్యున‌ళ్ల‌పై అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. స‌మ‌గ్ర స‌ర్వే స‌మ‌యంలో భూ వివాదాల ప‌రిష్కారం కోసం మొబైల్ ట్రైబ్యున‌ళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పిన జ‌గ‌న్‌... స‌ర్వే పూర్తయ్యాక మండ‌ల స్థాయిలో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ట్రైబ్యున‌ళ్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని ఆయ‌న సూచించారు.

రాష్ట్రంలోని ప్ర‌తి మండ‌లంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానున్న‌ ట్రైబ్యునళ్ల ద్వారా భూ య‌జ‌మానులు న్యాయపరంగా దక్కే హక్కులను వీలైనంత త్వరగా పొందేందుకు వీలు ఉంటుందని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. వివాదాల్లో ఉండి తరాలతరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదని ఆయ‌న పేర్కొన్నారు.

సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలు.. ఇలా అంశాల వారీగా గుర్తించాలన్న జ‌గ‌న్‌, దీనివల్ల కొనుగోలుదార్లకు ఆయా భూములు లీగల్‌గా క్లియర్‌గా ఉన్నాయా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలని, దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం చేకూరదని అన్నారు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయ‌న తెలిపారు. 

తమ భూమిలో సర్వేకావాలని భూ య‌జ‌మాని దరఖాస్తు చేసుకుంటే.. కచ్చితంగా సర్వే చేయాల్సిందేన‌ని ముఖ్యమంత్రి అన్నారు. నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే.. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వేలో ఏరియల్‌ ఫ్లైయింగ్, డ్రోన్‌ఫ్లైయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలని, సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని తెలిపారు. సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సదుపాయం రావాలన్న సీఎం... అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాల‌ని సూచించారు.

More Telugu News