2nd T20: నేడు రెండు గంటల ఆలస్యంగా టీమిండియా, వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్... ఎందుకంటే...!

  • ట్రినిడాడ్ లో ముగిసిన తొలి మ్యాచ్
  • నేడు సెయింట్ కిట్స్ లో రెండో మ్యాచ్
  • ట్రినిడాడ్ నుంచి ఆటగాళ్ల కిట్లు ఇంకా చేరుకోని వైనం
  • ఆలస్యానికి మన్నించాలంటూ విండీస్ బోర్డు ప్రకటన
Second T20 match between Team India and West Indies delayed by two hours

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్ అనూహ్య రీతిలో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. అసలేం జరిగిందంటే... టీమిండియా, వెస్టిండీస్ తమ తొలి టీ20 మ్యాచ్ ను ట్రినిడాడ్ లో ఆడాయి. అయితే, రెండో మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న సెయింట్ కిట్స్ కు ఆటగాళ్ల లగేజీ, క్రికెట్ సరంజామా చేరుకోవడంలో ఆలస్యమైంది. 

సకాలంలో కిట్లు రాకపోవడంతో మ్యాచ్ ను నిర్దేశిత సమయానికి ప్రారంభించలేకపోతున్నట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, కిట్లు అందకపోవడంతో రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. 

దీనిపై వెస్టిండీస్ బోర్డు స్పందిస్తూ, ఎంతో విలువైన అభిమానులు, స్పాన్సర్లు, ప్రసార భాగస్వాములు, ఇతర భాగస్వాములు అసౌకర్యానికి మన్నించాలని కోరింది. ఆటగాళ్ల లగేజి తరలింపు తమ పరిధిలో లేని విషయం అని పేర్కొంది. కాగా, ఐదు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ గెలుపు బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News