India: గుడ్ న్యూస్.. దేశంలో మంకీపాక్స్ తొలి బాధితుడికి పూర్తిగా నయం

  • ఆసుపత్రి  నుంచి డిశ్చార్జ్ అయిన కేరళ బాధితుడు
  • చర్మంపై ఏర్పడ్డ పొక్కులు కూడా  పూర్తిగా నయం
  • నిలకడగా మరో ఇద్దరు బాధితుల ఆరోగ్య పరిస్థితి
Indias first monkeypox patient recovers and skin rash completely cured

భారత్ లో మొదటగా మంకీపాక్స్ వైరస్ బారిన పడిన కేరళకు చెందిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. కొల్లంకు చెందిన 35 ఏళ్ల బాధితుడు చికిత్స తర్వాత శనివారం  ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోగి నుంచి సేకరించిన అన్ని శాంపిల్స్ ను రెండుసార్లు పరీక్షించగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని  కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని, మంకీపాక్స్ కారణంగా అతని చర్మంపై ఏర్పడ్డ పొక్కులు కూడా పూర్తిగా నయమయ్యాయి అని వెల్లడించారు. 

యూఏఈ నుంచి వచ్చిన సదరు వ్యక్తి మంకీపాక్స్ బారిన పడ్డాడు. జులై 12న త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న అతను జులై 14న మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. మరోవైపు కేరళలో మంకీపాక్స్ పాజిటివ్ గా తేలిన మరో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే ఉంది. ఇక, దేశంలో తొలి మూడు మంకీపాక్స్ కేసులు తమ రాష్ట్రంలోనే నమోదైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నివారణ, నిఘా చర్యలను వేగవంతం చేసింది. కాగా, డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వైరస్ (వైరల్ జూనోసిస్). గతంలో మశూచి రోగులలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది. కానీ, మశూచి కంటే తక్కువ తీవ్రతతో ఉంటుంది.

More Telugu News