Helicopter: డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం నిందితుడి నుంచి హెలికాప్టర్ స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు

  • భారత్ లో అతిపెద్ద బ్యాంకు స్కాం
  • రూ.34 వేల కోట్ల నిధుల దారిమళ్లింపు కేసు
  • పలుచోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ
  • పూణేలో ఓ ప్రాంగణంలో అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ గుర్తింపు
CBI seized helicopter from DHFL scam accused in Pune

దేశంలో సంచలనం సృష్టించిన రూ.34 వేల కోట్ల విలువైన దివాన్ హౌసింగ్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) స్కాంలో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో, పూణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలే కు చెందిన ఓ ప్రాంగణంలోనూ సీబీఐ అధికారులు తనిఖీ చేపట్టారు. 

అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ ను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ హాలులో అన్నీ పాప్ సంగీత సంస్కృతిని ప్రతిబింబించే పోస్టర్లు ఉన్నాయి. కాగా, ఈ బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు కపిల్ వాధ్వాన్, దీపక్ వాధ్వాన్ తదితరులపై సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసింది. 

17 బ్యాంకులతో కూడిన కన్సార్టియంను వారు మోసగించి రూ.34,615 కోట్ల మేర రుణాలను దారిమళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వారు పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, సమాంతర ఆడిట్ వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్టు వెల్లడైంది. లేని వ్యక్తులకు నకిలీ లోన్లు ఇవ్వడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ లోని పబ్లిక్ ఫండ్స్ ను కాజేసేందుకు వీరు పథకరచన చేసినట్టు గుర్తించారు.

More Telugu News