Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: జైలుపై రాకెట్ దాడి.. 53 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల మృతి

  • జైలుపై దాడి మీ పనేనంటూ రష్యా-ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు
  • జైలులో జరుగుతున్న చిత్రహింసలను కప్పిపుచ్చేందుకేనంటున్న ఉక్రెయిన్
  • అమెరికా అందించిన రాకెట్‌తో ఉక్రెయినే దాడికి పాల్పడిందన్న రష్యా
Ukraine denies missile strike on Donbas prison

ఉక్రెయిన్‌పై నెలల తరబడి యుద్ధం చేస్తున్న రష్యా కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు, ఉన్న వనరులతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యాను ఎదురొడ్డుతోంది. రష్యా క్షిపణి దాడులకు ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు, పట్టణాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలోని ఓ జైలుపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో 53 మంది మరణించారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలే. యుద్ధంలో తమకు పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను రష్యా సైన్యం ఈ జైలులో నిర్బంధించింది.

ఈ రాకెట్ దాడి మీ పనే అంటే, మీ పనేనని రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. అమెరికా ఇచ్చిన ‘హిమార్స్’ రాకెట్ లాంచర్లతో ఉక్రెయిన్ దాడులకు దిగిందని, ఈ ప్రాణనష్టానికి కారణం అదేనని రష్యా వాదిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండించిన ఉక్రెయిన్.. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగా జైలుపై దాడి చేసి ఆ నెపాన్ని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. జైలులో జరుగుతున్న చిత్రహింసలను కప్పిపుచ్చేందుకే రష్యా ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని ఉక్రెయిన్ ఆరోపించింది.

జైలుపై దాడి ఘటనలో గాయపడిన వారిలో 8 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగార్ కొనాషెంకోవ్ పేర్కొన్నారు. జైలులో మొత్తం 193 మంది ఖైదీలు ఉన్నట్టు రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాద నాయకుడు డెనిస్ పుషులిన్ తెలిపారు. మరోవైపు, డోనెట్స్క్‌లో రష్యా దాడులు తీవ్రతరం కావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు పౌరులకు సూచించారు.

More Telugu News