Vijayasai Reddy: ఏపీ శ్రీలంక కావడం కాదు... చంద్రబాబే రాజపక్సలా ఏ సింగపూరో పారిపోతాడు: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • చంద్రబాబు సర్కారు ఐదుగురి కోసమే పనిచేసిందన్న విజయసాయి 
  • వైసీపీ సర్కారు ఐదుకోట్లమంది కోసం పనిచేస్తున్నట్టు వివరణ
  • చంద్రబాబు హయాంలో బంధుప్రీతి ఉండేదని వ్యాఖ్య 
Vijayasai Reddy replies to TDP criticism

ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిందని, రాష్ట్రం మరో శ్రీలంక కానుందని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీటుగా బదులిచ్చారు. ఏపీ శ్రీలంక కావడం కాదు... చంద్రబాబే రాజపక్సలాగా ఏ సింగపూరో పారిపోతాడని ఎద్దేవా చేశారు.  జగన్ ముఖ్యమంత్రిగా ఏపీ అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

2020-21లో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.10,14,374 కోట్లు అని వెల్లడించారు. 2021-22లో అది రూ.12,01,736 కోట్లు అని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుదల కనిపిస్తోంది కదా అని వ్యాఖ్యానించారు. జీడీఏ పరంగానూ ఇదే అభివృద్ధి ఉందని, 2021-22లో 18.47 శాతంగా ఉందని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇదే అత్యధికం అని విజయసాయి వెల్లడించారు. 

నాడు చంద్రబాబు సర్కారు కేవలం ఐదారుగురు కోసం మాత్రమే పనిచేస్తే, నేడు వైసీపీ ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పనిచేస్తోందని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. 

"ఆ ఐదుగురు ఎవరంటే... చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, రామోజీరావు ఆయన కుటుంబసభ్యులు, రాధాకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు, టీవీ5 బీఆర్ నాయుడు ఆయన కుటుంబసభ్యులు, ఇంకొకరు కూడా ఉన్నారు.. అది చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు పాలనలో వీళ్లు ఐదుగురే లబ్దిపొందారు. చంద్రబాబు హయాంలో బంధుప్రీతి ఉండేది. మా పభుత్వంలో అదిలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ శ్రీలంకలా కావడం అసంభవం. ఒకవేళ అయితే చంద్రబాబు ఏమైనా రాజపక్సలాగా అవుతాడేమో కానీ శ్రీలంక పరిస్థితి ఏపీకి రాదు. చంద్రబాబు కూడా రాజపక్సలాగా మున్ముందు సింగపూరో, మరో దేశమో వెతుక్కోవాల్సి ఉంటుంది" అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.

More Telugu News