Telugu Film Producers Council: తెలుగు ఫిలించాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం... కీలక నిర్ణయాల వెల్లడి

  • టికెట్ ధరలపై తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతిపాదనలు
  • విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీలోకి భారీ బడ్జెట్ చిత్రాలు
  • వీపీఎఫ్ చెల్లింపులు డిస్ట్రిబ్యూటర్లే చేయాలన్న నిర్మాతల మండలి
  • షూటింగుల నిలిపివేతపై నిర్ణయం తీసుకునే బాధ్యత కమిటీకి అప్పగింత
Producers council announces key decisions

ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు సిద్ధమవుతున్న నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ హైదరాబాదులోని తెలుగు ఫిలిం చాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం నిర్మాతల మండలి తమ నిర్ణయాలపై ఓ ప్రకటన చేసింది. 

నగరాలు, పట్టణాల్లో మామూలు థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.70, రూ.100 గా ఉంచాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతిపాదించినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. అదేసమయంలో, మల్టీప్లెక్స్ లో రూ.125 ఉండాలని పేర్కొన్నట్టు తెలిపింది. మధ్యశ్రేణి హీరోలు, మీడియం బడ్జెట్ సినిమాల టికెట్ ధరలు నగరాలు, పట్టణాల్లో రూ.100 ఉండాలని, సి-క్లాస్ సెంటర్లలోనూ రూ.100 ఉండాలని, మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా టికెట్ ధర రూ.150 ఉండాలని ప్రతిపాదించినట్టు వివరించింది. 

ఓటీటీలో పెద్ద సినిమాల స్ట్రీమింగ్ పైనా కీలక నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. ఇకమీదట భారీ బడ్జెట్ సినిమాలను విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి. రూ.6 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

అంతేకాదు, సినిమా షూటింగుల సమయంలో నటీనటులు తమ అసిస్టెంట్లకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయడానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నారు. నటీనటుల పారితోషికం నుంచే వారి సహాయకుల వసతి సౌకర్యాలకు చెల్లింపులు జరపాలి. ముఖ్యంగా, నటీనటులు, టెక్నీషియన్లు సమయానికి షూటింగులకు హాజరు కావాలని, తద్వారా నిర్ణీత సమయానికి సినిమాలు పూర్తవుతాయని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

నిర్మాతలు కూడా బడ్జెట్ పై ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి నియామవళి పాటించాలని, బడ్జెట్ పెంచుకోవాలంటే ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో తప్పక చర్చించాలని నిర్ణయించారు. 

డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను డిస్ట్రిబ్యూటర్లే చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఆగస్టు 1 నుంచి చిత్రీకరణలు నిలిపివేసే అంశంపై తుది నిర్ణయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీకి వదిలివేశారు.

More Telugu News