AP: ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారేం.. తెలంగాణ కంటే ఏపీ ద్రవ్యలోటు తక్కువే: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

  • ఎక్కువ వడ్డీకి రుణాలు తెస్తున్నారన్న ఆరోపణలపైనా మండిపాటు
  • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యాఖ్య
  • ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్న
AP Minister Buggana rajendranath counter to central government

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అప్పులు చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవసరాల కోసం అప్పులు చేస్తున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ రుణాలు తీసుకుంటోందని, ద్రవ్యలోటు పెరిగిపోయిందని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం, దీని ఆధారంగా పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఆ ఆరోపణలు సరికాదు
ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు ఎక్కువగా ఉందన్న ఆరోపణలు సరికాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని.. ఎక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామన్న ఆరోపణలు కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువేనని తెలిపారు. 

తెలంగాణలో ద్రవ్యలోటు 4.13 శాతంగా ఉంటే.. ఏపీలో ఇది 3 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ద్రవ్యలోటు రూ.20,745 వేల కోట్లు కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.25,195 కోట్లకు చేరిందని వివరించారు. ద్రవ్యలోటు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని.. అయినా ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News