Uddhav Thackeray: నా తండ్రి ఫొటోతో ఓట్లు అడుక్కోవద్దు.. మీ తండ్రుల పేర్లు చెప్పుకుని ఓట్లు తెచ్చుకోండి: ఉద్ధవ్ థాకరే

  • తన తండ్రి స్థాపించిన శివసేనను ఎవరూ ఏమీ చేయలేరన్న ఉద్ధవ్ 
  • తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కిందకు లాగాలని ప్రయత్నించారంటూ ఆరోపణలు 
  • శివసేనను థాకరేల నుంచి విడదీయాలని కుట్ర చేశారని వ్యాఖ్య 
Use Own Parents Photos For Votes says Uddhav Thackeray

శివసేన రెబెల్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విమర్శలు గుప్పించారు. గతంలో అనారోగ్యంతో తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తనను కిందకు లాగేందుకు షిండే యత్నించాడని తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవి పోయినప్పటికీ తనకు ఎలాంటి విచారం లేదని ఆయన అన్నారు. కానీ తన సొంత మనుషులే మోసం చేయడం బాధాకరమని చెప్పారు. 

తాను సర్జరీ చేయించుకుని, కోలుకుంటున్న సమయంలో కూడా తనను కిందకు లాగేందుకు యత్నించారని విమర్శించారు. తన తండ్రి స్థాపించిన శివసేనను ఎవరూ ఏమీ చేయలేరని... కోర్టుల్లో, వీధుల్లో జరిగే యుద్ధంలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

వాళ్లు తనను మోసం చేశారని, పార్టీని చీల్చారని... వారు తన తండ్రి పేరు చెప్పుకుని కాకుండా, వారి తండ్రుల పేర్లు చెప్పుకుని ఓట్లు తెచ్చుకోవాలని థాకరే సవాల్ చేశారు. శివసేన పిత ఫొటోలను చూపిస్తూ ఓట్లు అడుక్కోవద్దని చెప్పారు. 

తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను కోలుకోవాలని కొందరు ప్రార్థించగా, కోలుకోకూడదని కొందరు కోరుకున్నారని థాకరే అన్నారు. సర్జరీ జరిగినప్పుడు తాను కనీసం కదలలేని స్థితిలో ఉన్నానని... ఆ సమయంలో ఒక వ్యక్తిని నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థాయిని కల్పించానని చెప్పారు. పార్టీని కాపాడతావని నీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఛిద్రం చేశావని షిండేను ఉద్దేశించి అన్నారు. శివసేనను థాకరేల నుంచి విడదీయాలని రెబెల్స్ కుట్ర చేశారని మండిపడ్డారు. 

ఇతర పార్టీలకు చెందిన గొప్ప నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని థాకరే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను లాక్కున్నారని... ఇప్పుడు తన తండ్రి బాల్ థాకరేను కూడా లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రెబెల్స్ పై అనర్హత వేటు పడేంత వరకు శివసేన ఎవరిది అనే విషయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు. 

ఇదే సమయంలో తనను తాను కూడా థాకరే నిందించుకున్నారు. కొందరు శివసేన నేతలపై తాను అంతులేని నమ్మకం పెట్టుకున్నానని, ఎంతో కాలంగా వారిని నమ్ముతూ వచ్చానని... ఇదే తాను చేసిన అతి పెద్ద తప్పిదమని అన్నారు.

More Telugu News