Zomato: జొమాటో వాటాదారులకు నిద్రలేని రాత్రులు..!

  • ఐపీవో ధర రూ.76
  • లిస్టింగ్ తర్వాత రూ.179 వరకు పెరుగుదల
  • 2021 నవంబర్ తర్వాత నుంచి పతన బాటే
  • ప్రస్తుతం రూ.48 స్థాయిలో చలనం
  • భవిష్యత్తు పట్ల స్పష్టత తెచ్చుకోవాల్సింది ఇన్వెస్టర్లే
Zomato Crashes Share Lock In Period Expires Zomato Crashes

న్యూ ఏజ్ కంపెనీ. భవిష్యత్తులో ఎంతో పెద్ద కంపెనీగా మారిపోతుంది. ఈ రంగంలో మిగిలినవి రెండే కంపెనీలు. కనుక వ్యాపారమంతా వీటి గుత్తాధిపత్యంలోనే ఉంటుంది. ఎదిగేందుకు హద్దు లేదు. ఇవన్నీ జొమాటో ఐపీవో సందర్భంగా విశ్లేషకుల నుంచి వినిపించిన మాటలు.  

అయితే, ఇలాంటి కంపెనీల్లో షార్ట్ టర్మ్ (స్వల్ప కాలం కోసం) ధోరణితో పెట్టుబడులు సరికాదు. పదేళ్లకు పైనే కొనసాగాల్సి రావచ్చు. అప్పటికి కూడా ఇవి సక్సెస్ అవ్వాలనమే లేదు. సక్సెస్ అయితే మాత్రం రాబడులు అద్భుతంగా ఉంటాయి. ఇలా కూడా కొందరు విశ్లేషకులు చెప్పారు. కానీ, నెగెటివిటీని రిటైల్ ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. వారికి జొమాటో తెగ నచ్చేసింది. ఐపీవోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొన్లో యాప్ తెరిచి ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చే జొమాటో బాగా పరిచయమున్న బ్రాండ్ కావడం కూడా వారి ఆసక్తికి కారణం.

2021 జులై 16న ఈ ఐపీవో ముగిసింది. ఒక్కో షేరును రూ.76కు కేటాయించారు. కానీ, లిస్ట్ అయింది రూ.115 దగ్గర. అదే ఏడాది నవంబర్ లో జొమాటో షేరు ధర రూ.169 గరిష్ఠ స్థాయిని చూసింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ షేరు రివర్స్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం రూ.48 రూపాయలకు పడిపోయింది. సోమవారం ఒక్క రోజే 10 శాతం పతనాన్ని చూసింది. ఐపీవోకు ముందు ఇన్వెస్ట్ చేసిన వారికి లాకిన్ ముగిసిపోయింది. వారు ఇక్క స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఆ ప్రభావం షేరుపై పడింది.

సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు ఒక కంపెనీలో పెట్టుబడిని కొనసాగించలేరు. ఇలా చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. పైగా తాము కొన్న ధర నుంచి పడిపోతుంటే కంగారు పడిపోయి అమ్మేస్తుంటారు. కొందరు చాలా కాలం పాటు ఓపిక పట్టి అత్యంత కనిష్ఠ ధరకు విక్రయించి భారీ నష్టాలను మూటగట్టుకుంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు జొమాటో షేరు ఇప్పుడు నిద్రలేకుండా చేస్తోంది. తిరిగి తాము కొన్న ధరకు ఎప్పుడొస్తుందా? అన్న ఆశతో ఎదురుచూస్తూ ఉసూరుమంటున్నారు.

ఈ తరుణంలో నిపుణులను అడిగినా, జొమాటో షేరు గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జొమాటోకానీ, స్విగ్గీ కానీ నష్టాలతో వ్యాపారాన్ని పెంచుకుంటున్న సంస్థలు. కనుక లాభాల్లోకి ఎప్పుడొస్తాయో తెలియదు. ఇదే విషయాన్ని జొమాటో ఐపీవో పత్రాల్లో కూడా పేర్కొంది. పైగా క్విక్ కామర్స్ సేవల కంపెనీ బ్లింకిట్ ను జొమాటో తనలో విలీనం చేసుకుంటోంది. ఇది మరిన్ని నష్టాలకు దారితీస్తుంది. తాజా పతనం వెనుక ఇది కూడా ఒక కారణమే. కనుక ఇన్వెస్టర్లే తమ నష్ట భయం కోణలో వివేకంతో నిర్ణయం తీసుకోవాలి.

More Telugu News