Draupadi Murmu: ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు..: జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

  • నేను రాష్ట్రపతి భవన్ కు రావడం దేశంలోని పేద ప్రజలందరి విజయం
  • ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టడం సంతోషకరం
  • ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య అందాలనేదే నా ఆకాంక్ష
President Draupadi Murmu first speech

భారత దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో జాతిని ఉద్దేశించి ఆమె తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.  

ఒక ఆదివాసీ గ్రామంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని... దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే ఒక నిదర్శనమని అన్నారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం ప్రారంభమయిందని... 75 ఏళ్ల వేడుకల వేళ దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యానని... తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. 

దేశంలో అందరికీ ప్రాథమిక విద్య అందాలనేది తన ఆకాంక్ష అని ముర్ము తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతిపై దృష్టి సారిస్తానని చెప్పారు. యువతను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. యువతకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. 

2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము పని చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కేబినెట్ లో ఆమె రాష్ట్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో బీజేపీ మద్దతుతో బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధారణ క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించిన ముర్ము... అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించడం అందరికీ గర్వకారణం.

More Telugu News