Elon Musk: సెర్గీ బ్రిన్ భార్య నికోల్ తో అఫైర్ పై ఎలాన్ మస్క్ స్పందన

  • నికోల్ తో ఎలాన్ మస్క్ కు అక్రమ సంబంధం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం
  • ఈ వార్తలో ఎలాంటి నిజం లేదన్న మస్క్
  • నికోల్ ను గత మూడేళ్లలో రెండు సార్లే చూశానన్న టెస్లా అధినేత
  • సెర్గీ, తాను ఇప్పటికీ మంచి మిత్రులమని వ్యాఖ్య
  • నిన్న రాత్రి కూడా ఇద్దరం ఒక పార్టీలో ఉన్నామని వెల్లడి
I dont have any affair with Sergey Brin wife Nicole Shanahan says Elon Musk

గూగుల్ సంస్థ సహ వ్యవస్థాకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ తో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అక్రమ సంబంధం ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన వార్త సంచలనం రేపుతోంది. ఈ ఆరోపణలను ఎలాన్ మస్క్ ఖండించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. నికోల్ తో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను, సెర్గీ బ్రిన్ ఇప్పటికీ చాలా మంచి స్నేహితులమని అన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారం ఒక వదంతి మాత్రమేనని చెప్పారు.     

సెర్గీ బ్రిన్, తాను ఇప్పటికీ మంచి మిత్రులమని... నిన్న రాత్రి కూడా ఇద్దరం ఒక పార్టీలో ఉన్నామని మస్క్ చెప్పారు. సెర్గీ భార్య నికోల్ ను గత మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశానని.... ఆ సమయంలో కూడా తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారని తెలిపారు. తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ విషయం లేదని ట్వీట్ చేశారు. 

ఎలాన్ మస్క్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన కథనం ఇదే:

"చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే తన భార్యతో మస్క్ కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది.

ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.       

మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్ కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. టెస్లా వాహనాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కొన్ని వాహనాలను మస్క్ కొందరికి ఇచ్చారు. వారిలో బ్రిన్ కూడా ఉన్నారు. అంతేకాదు 2008లో టెస్లా కంపెనీ కొంత ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు 5 లక్షల డాలర్లను మస్క్ కు బ్రిన్ సాయం చేశాడు. ఇంత మంచి స్నేహం అక్రమ సంబంధం కారణంగా చెడిపోయింది". వాల్ స్ట్రీస్ జర్నల్ ప్రచురించిన ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

More Telugu News