Smriti Irani: క్షమాపణలు చెప్పండి... కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

  • స్మృతి ఇరానీ కుమార్తె బార్ నడుపుతోందన్న కాంగ్రెస్ నేతలు
  • దీటుగా స్పందించిన కేంద్రమంత్రి
  • పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాలకు నోటీసులు
  • లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్
Union minister Smriti Irani sends legal notices to Congress leaders

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందంటూ కాంగ్రెస్ నేతలు దుమారం రేపడం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతల ఆరోపణలను స్మృతి ఇరానీ దీటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె న్యాయపరమైన చర్యలకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాలకు ఉద్దేశించి ఆమె నోటీసులు పంపారు. 

ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ఓ మంత్రిగా, వ్యక్తిగా ప్రజాజీవనంలో ఉన్న తన క్లయింటు పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ఈ అసత్య ఆరోపణలు చేశారని, ఆమె, ఆమె కుమార్తె నడవడికపై నష్టదాయక ప్రచారం సాగించారని స్మృతి ఇరానీ న్యాయవాది ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో ఎలాంటి బార్ లేదని స్పష్టం చేశారు.

కాగా, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న బార్ వద్దకు గోవా యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. 'బార్' అనే అక్షరాలపై టేప్ అంటించి ఉండడాన్ని గుర్తించిన నేతలు, ఆ టేప్ ను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News