Ambati Rambabu: శ్రీశైలం నుంచి దిగువకు పరుగులు తీసిన కృష్ణమ్మ... క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు

  • శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ
  • ఎగువ నుంచి భారీగా నీరు
  • మూడు క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రి అంబటి
  • నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు
AP Irrigation Minister Ambati Rambabu lifts radial crest gates at Srisailam Project

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ ఉట్టిపడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు 882.50 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆయన 6, 7, 8 నెంబరు గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీసింది. ఈ నీటి ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోనుంది. 

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 57 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా, జులై మాసంలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం గత 12 ఏళ్లలో ఇది మూడోసారి మాత్రమే. మంత్రి అంబటి రాంబాబు క్రస్ట్ గేట్లు ఎత్తిన సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అర్చకులు కృష్ణమ్మకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పాల్గొన్నారు.

More Telugu News