World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్​లో ఫైనల్​ చేరిన మరో భారత క్రీడాకారుడు

  • ట్రిపుల్ జంప్ లో ఫైనల్ రౌండ్ చేరుకున్న ఎల్డోస్ పాల్
  • ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్ గా రికార్డు
  • ఇదే ఈవెంట్ లో అర్హత రౌండ్ లో వెనుదిరిగిన చిత్రవేల్, అబ్దుల్లా
Triple jumper Eldhose Paul qualifies for World Athletics finals

అమెరికాలోని యుగీన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో మరో భారత క్రీడాకారుడు ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ ఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో ఎల్డోస్ 16.68 మీటర్ల దూరం దూకాడు. దాంతో, గ్రూప్-ఎ క్వాలిఫికేషన్ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా 12వ స్థానంలో నిలిచి ఆదివారం ఉదయం జరిగే ఫైనల్ కు అర్హత సాధించాడు.

ఇదే పోటీల్లో బరిలోకి దిగిన మరో ఇద్దరు భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబేకర్ ఫైనల్ చేరుకోలేకపోయారు. ప్రవీణ్ 16.49 మీటర్లతో గ్రూప్-ఎలో ఎనిమిది, ఓవరాల్ గా 17వ స్థానం సాధించాడు. అబ్దుల్లా  గ్రూప్-బిలో పది, మొత్తంగా 19వ స్థానంతో నిరాశ పరిచాడు. అర్హత రౌండ్లలో 17.05 మీటర్ల దూరం దూకిన వాళ్లు, లేదంటే టాప్12 అత్యుత్తమ ప్రదర్శన చేసినవాళ్లు ఫైనల్ రౌండ్ కు అర్హత సాధిస్తారు.
 
కాగా, 25 ఏళ్ల ఎల్డోస్ వీసా సమస్యల కారణంగా ఆలస్యంగా ఈ టోర్నీకి వచ్చాడు. కాగా, ఏప్రిల్లో జరిగిన ఫెడరేషన్ కప్ లో స్వర్ణ పతకం గెలిచే క్రమంలో ఎల్డోస్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (16.99 మీటర్ల) నమోదు చేశాడు.

More Telugu News