President Of India: ఓటమిని అంగీకరించి విజేత‌కు అభినంద‌న‌లు తెలిపిన య‌శ్వంత్ సిన్హా

  • కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓట‌మి అంగీక‌రించిన సిన్హా
  • ముర్ముకు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
  • రాష్ట్రప‌తిగా నిర్భయంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ముర్ముకు సూచ‌న‌
Yashwant Sinha congratulates draupadi murmu

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా ప‌రిణ‌తి క‌లిగిన రాజ‌కీయ నేత‌గా త‌న‌ను తాను నిరూపించుకున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌‌ల్లో తుది ఘ‌ట్ట‌మైన ఓట్ల లెక్కింపులో లెక్కింపు పూర్తి కాకుండానే విజ‌యానికి స‌రిప‌డ ఓట్ల‌ను సాధించిన అధికార ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గానే ఆయ‌న త‌న ఓట‌మిని అంగీక‌రించారు. ఈ మేర‌కు గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దానిని ట్విట్ట‌ర్ వేదిక‌గానూ ఆయ‌న పంచుకున్నారు. 

అధికార ప‌క్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంద‌ని తెలిసి కూడా విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా పోటీ చేసిన య‌శ్వంత్ సిన్హా ఓటు హక్కు క‌లిగిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖ‌రారు కాగానే.. విజేత ద్రౌప‌ది ముర్ముకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. భార‌త రాష్ట్రప‌తిగా విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్భయంగా, నిష్పాక్షికంగా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ ఆయ‌న ముర్ముకు సూచించారు.

More Telugu News