Dil Raju: ఇక నుంచి స్టార్ హీరోల సినిమా టికెట్ ధరలు ఇవే: దిల్ రాజు

  • హైదరాబాద్, విశాఖపట్నంలలో సింగిల్ స్క్రీన్ లలో జీఎస్టీతో కలిపి రూ. 150 
  • మల్టీప్లెక్స్ లలో జీఎస్టీతో కలిపి రూ. 200 
  • నిర్మాతలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్న దిల్ రాజు
Cinema ticket rated for star hero films fixed

కరోనా మహమ్మారి పుట్టుకొచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమ డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా మళ్లీ పరిశ్రమ జీవం పోసుకుంటోంది. థియేటర్లకు రావడానికి ఆడియెన్స్ కూడా మొగ్గుచూపుతుండటంతో... ఇండస్ట్రీలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి. అయితే, టికెట్ ధరల అంశం గత కొంత కాలంగా ఇండస్ట్రీని కలవర పెడుతోంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు నిర్మాతలందరూ కలిసి లోతుగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలను ఖరారు చేశారు. 

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాల ధరలను ఖరారు చేశామని తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో సింగిల్ స్క్రీన్ లలో జీఎస్టీతో కలిపి రూ. 150, మల్టీప్లెక్స్ లలో జీఎస్టీతో కలిపి రూ. 200గా నిర్ణయించామని చెప్పారు. నిర్మాతలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 'ఎఫ్3' టికెట్ ధరను తాము తగ్గించామని.. ఆ తర్వాత వచ్చిన 'విక్రమ్', 'మేజర్' సినిమాలు కూడా అదే ధరతో ప్రదర్శితమయ్యాయని చెప్పారు. 

మరోవైపు నాగచైతన్య, అవికాగోర్, మాళవికా నాయర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన 'థ్యాంక్ యూ' చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ, ప్రేక్షకులందరి మనసుల్లో ఈ చిత్రం నిలిచిపోతుందని చెప్పారు.

More Telugu News