Uttar Pradesh: తోపుడు బండి వ్యాపారికి తుపాకులతో బాడీగార్డుల రక్షణ!

  • తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్న రామేశ్వర్ దయాళ్
  • ఎస్పీ నేతతో వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
  • హైకోర్టును ఆశ్రయించిన ఎస్పీ నేత
  • కోర్టు ఆదేశాలతో రామేశ్వర్‌కు భద్రత
Street Vendor gets Two Gunmen Security

ఉత్తరప్రదేశ్‌లో తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకు రూ.200-300 సంపాదించే ఆ తోపుడు బండి యజమానికి బాడీగార్డుల రక్షణ వెనక పెద్ద కథే ఉంది. ఆయన పేరు రామేశ్వర్ దయాళ్. ఎటా జిల్లాకు చెందిన ఆయన తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. రామేశ్వర్ ఇటీవల ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్ సోదరుడు, జిల్లా పంచాయతీ మాజీ అధక్షుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని కోరాడు. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో తనను కులం పేరుతో దూషించారంటూ జుగేంద్ర, లేఖపాల్ రాంఖిలాడి, రామమూర్తి, రేఖలపై రామేశ్వర్ దయాళ్ ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జుగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, కేసును కొట్టివేయాలని కోరారు. దీంతో కోర్టుకు హాజరుకావాల్సిందిగా రామేశ్వర్ దయాళ్‌ను కోర్టు ఆదేశించింది. 

శనివారం ఆయన కోర్టుకు ఒంటరిగా రావడాన్ని గమనించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయనకు రక్షణ ఎందుకు కల్పించలేదని పోలీసులను ప్రశ్నించింది. వెంటనే ఇద్దరు బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు గార్డులను నియమించారు. వారిద్దరూ ఏకే 47 రైఫిళ్లతో ఆయనకు రక్షణగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది.

More Telugu News