Telangana: టీఆర్ఎస్‌ను వీడిన అలిగిరెడ్డి... కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే

  • 2009లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్ర‌వీణ్ రెడ్డి
  • 2014లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయిన వైనం
  • 2018కి ముందే టీఆర్ఎస్‌లో చేరినా టికెట్ ద‌క్క‌ని వైనం
  • ఖ‌ర్గే, రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే
Aligireddy Praveen Reddy joins in to congress party

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను మ‌రో కీల‌క నేత వీడారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని వెంట‌బెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన అలిగిరెడ్డి... రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ష‌బ్బీర్ అలీ పాల్గొన్నారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించిన‌ అలిగిరెడ్డి... 2014లో వొడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిన ఆయ‌న‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. హుస్నాబాద్‌లో గత రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్ టికెట్ సతీష్ ‌కుమార్‌కే దక్కిన నేప‌థ్యంలో గ‌త‌ కొంత కాలంగా అలిగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ దక్కదేమోనని భావించి తిరిగి సొంత గూటికి వెళ్లినట్లు స‌మాచారం.

More Telugu News