Drone: ఆకాశంలో డ్రోన్లు తిరగడానికి ప్రత్యేకంగా ‘సూపర్​ హైవేలు’.. ఢీకొట్టుకోకుండా ఎలా నడుపుతారంటే..!

  • బ్రిటన్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలు
  • డ్రోన్లు ఎగిరేందుకు ప్రత్యేకంగా కొంత వెడల్పున ఆకాశ మార్గంలో దారి గుర్తింపు
  • దాని వెంట సెల్ ఫోన్ టవర్ల తరహాలో ఆధునిక సెన్సర్లతో కూడిన పరికరాలు
  • డ్రోన్ల రాకపోకలను నిరంతరం గమనిస్తూ.. ట్రాఫిక్ ను నియంత్రించేలా ఏర్పాట్లు
Superhighways for Drones

కార్లు, బైకుల్లో రోడ్లపై వేగంగా దూసుకుపోతుంటాం. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ నడుపుతుంటాం, వెనకాల వస్తున్న వాటికి దారి ఇస్తుంటాం. ఇలా ఎంత పక్కాగా ఉన్నా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాహనాలు ఢీకొడుతుంటాయి. మరి ఇలాంటివేవీ ఉండని ఆకాశ మార్గంలో డ్రోన్లు దూసుకుపోతుంటే.. ప్రమాదాలు జరగకుండా నియంత్రించడం ఎలా? ఈ ఆలోచనతోనే బ్రిటన్ నిపుణులు సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఆకాశంలో నిర్ణీత ప్రాంతాన్ని ఓ సూపర్ హైవేగా గుర్తించి, ఆ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లను చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.

ప్రత్యేక టవర్లు, సెన్సర్లతో..

  • బ్రిటన్ కు చెందిన ఆల్టిట్యూడ్‌ ఏంజిల్‌, బీటీ తదితర సంస్థలు కలిసి ఓ కన్సార్షియంగా ఏర్పాటై.. ఆకాశంలో డ్రోన్ల కోసం ‘సూపర్ హైవే’లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి.
  • భూమిపై వాహనాలకు ఎక్కడికక్కడ సిగ్నళ్లు, ట్రాఫిక్ చిహ్నాలు ఉండి మనను అప్రమత్తం చేస్తుంటాయి. అదే తరహాలో ఆకాశ మార్గాన ప్రయాణించే డ్రోన్లకూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డేటాను అందించేలా ఏర్పాట్లు చేశారు.
  • డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ‘డీఏఏ (డిటెక్ట్‌ అండ్‌ అవాయిడ్‌)’ అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించనున్నారు. డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో పెద్ద పెద్ద టవర్లను ఏర్పాటు చేస్తారు. వాటిలో పలు రకాల సెన్సర్లను, పరికరాలను అమర్చుతారు.
  • టవర్లలోని సెన్సర్లు నిరంతరం నిర్ణీత మార్గంలో ఎగురుతూ వెళుతున్న డ్రోన్లు, పక్షులు వంటి వాటిని పరిశీలిస్తూ ఉంటాయి. ఈ వివరాలను డ్రోన్లకు అందించి అవి ఢీకొట్టుకోకుండా జాగ్రత్తలను సూచిస్తాయి.
  • ఈ సూచనలకు అనుగుణంగా డ్రోన్లు ప్రయాణ మార్గాన్ని సరిదిద్దు కోవడం, వేగంలో మార్పులు చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా మన ట్రాఫిక్ వ్యవస్థ తరహాలో ఇది పనిచేస్తుందన్న మాట.
  • ప్రస్తుతం బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తదితర నగరాల మీదుగా సుమారు 265 కిలోమీటర్ల పొడవున డ్రోన్ల ‘సూపర్‌ హైవే’ను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. బ్రిటన్ ప్రభుత్వం దీనికి తాజాగా అనుమతి కూడా ఇచ్చింది.

ఎంతో ప్రయోజనం..
ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఫొటోలు, వీడియోల అవసరాల నుంచి వ్యవసాయం దాకా ఎన్నో అవసరాలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మందులు, ఇతర అత్యవసర సామగ్రి సరఫరాకు చాలా చోట్ల డ్రోన్లను వినియోగిస్తున్నారు. అమెజాన్ సంస్థ అయితే డ్రోన్లతో వస్తువులను డెలివరీ చేసేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో చాలా వరకు డెలివరీ సర్వీసులు డ్రోన్లతో జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ.. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించగలదని అంటున్నారు. 

More Telugu News