Polavaram Project: సీఎం అయినా, మంత్రులైనా బాధ్య‌త‌గా మాట్లాడాలి: ఏపీ మంత్రి బొత్స‌

  • రెచ‌గొట్టే వ్యాఖ్య‌లు స‌రికాద‌న్న బొత్స‌
  • పోల‌వ‌రం డిజైన్ల‌ను ఎవ‌రు మార్చార‌ని నిల‌దీత‌
  • ముంపు మండ‌లాల ప్ర‌జ‌లు ఏపీ కుటుంబ స‌భ్యుల‌ని వెల్ల‌డి
  • తెలంగాణ నేత‌లు ఖ‌మ్మం జిల్లా ముంపు చూసుకుంటే స‌రిపోతుంద‌ని వ్యాఖ్య‌
  • హైద‌రాబాద్‌ను ఏపీలో క‌లిపేయాల‌ని అడ‌గ‌గ‌ల‌మా? అని ప్ర‌శ్న‌
ap minister botsa counter attack to ts minister puvvada ajay comments on polavaram

భ‌ద్రాచలం ముంపు నేప‌థ్యంలో తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాకు చెందిన నేత‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు పెంపును ప్ర‌శ్నిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. సీఎం అయినా, మంత్రులైనా, ఇంకెవ‌రైనా బాధ్య‌త‌గా మాట్లాడాల్సిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు మంచిది కాద‌ని కూడా ఆయ‌న ఒకింత హెచ్చరిస్తున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల‌ని, విలీన మండ‌లాల్లోని 5 గ్రామాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బొత్స త‌ప్పుబ‌ట్టారు. 

పోల‌వ‌రం ఎత్తును ఎవ‌రు పెంచార‌ని ఈ సంద‌ర్భంగా బొత్స ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం నిర్మాణం అనుమ‌తి పొందిన డిజైన్ల ప్ర‌కారమే జ‌రుగుతోంద‌ని, వాటిని ఎవరూ మార్చ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే అంతా జ‌రుగుతోంద‌ని తెలిపారు. పోల‌వరం వ‌ల్ల భ‌ద్రాచ‌లం ముంపు ఉంటుంద‌ని ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ప్ర‌స్తావించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ముంపు మండ‌లాల బాధ్య‌త ఏపీదేన‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ముంపు మండ‌లాల ప్ర‌జ‌లు ఏపీ రాష్ట్ర కుటుంబ‌స‌భ్యులని అయన స్ప‌ష్టం చేశారు. త‌మ రాష్ట్ర ప్ర‌జ‌లైన ముంపు మండ‌లాల ప్ర‌జ‌ల సంగ‌తి తాము చూసుకుంటామ‌ని తెలిపారు. తెలంగాణ నేత‌లు ఖ‌మ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగ‌తి చూసుకుంటే స‌రిపోతుంద‌ని బొత్స అన్నారు.

రాష్ట్ర విభజ‌న వ‌ల్ల హైద‌రాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయింద‌న్న బొత్స‌.. అందుక‌ని హైద‌రాబాద్‌ను ఏపీలో క‌లిపేయ‌మ‌ని అడ‌గ‌గ‌ల‌మా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు క‌లిస్తే ఎవ‌రికీ ఇబ్బంది లేదు క‌దా? అని కూడా బొత్స అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ఇప్పుడు ముఖ్య‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కొంద‌రు వ్య‌క్తులు బాధ్య‌త‌గా మాట్లాడాల్సి ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సీఎం అయినా, మంత్రులు అయినా బాధ్య‌త‌గానే మాట్లాడాల‌న్నారు. రెచ్చ‌గొట్టే మాట‌లు స‌రికాద‌ని బొత్స హితవు పలికారు.

More Telugu News