NEET: ‘లో దుస్తులు’ తొలగింపుపై ఆరోపణలను ఖండించిన ఎన్టీఏ

  • అటువంటి ఘటన ఏదీ చోటు చేసుకోలేదని ప్రకటన
  • పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, పరిశీలకుడు ధ్రువీకరించినట్టు వెల్లడి
  • ఇలాంటి చర్యలను అనుమతించడం లేదని స్పష్టీకరణ
NTA rubbishes NEET candidates claim of being forced to remove innerwear before exam in Kerala

నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థినుల లోదుస్తులు తొలగించినట్టు వచ్చిన ఆరోపణలను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. నీట్ ను దేశవ్యాప్తంగా నిర్వహించే బాధ్యతలను ఎన్టీఏనే చూస్తోంది. కేరళలోని కొల్లాం జిల్లా అయూర్ లో నీట్ పరీక్షా కేంద్రంలోకి విద్యార్థినులను లోదుస్తులతో అనుమతించలేదన్న సమాచారం వెలుగులోకి రావడం తెలిసిందే. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.  


ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలపై వెంటనే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, స్వతంత్ర పరిశీలకుడు, సిటీ  కోర్డినేటర్ నుంచి వివరణ తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఈ తరహా ఘటన ఏదీ జరగలేదని వారు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. 

‘‘సదరు నీట్ అభ్యర్థి తండ్రి ఆరోపించినట్టుగా అటువంటి చర్యలు వేటినీ ఎన్టీఏ డ్రెస్ కోడ్ కింద అనుమతించడం లేదు. నియమావళి అన్నది పరీక్ష పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకే. ఈ విషయంలో లింగపరమైన, ప్రాంతీయ, సాంస్కృతిక సున్నితత్వాలను పరిగణనలోకి తీసుకుంటూ బయోమెట్రిక్ ప్రవేశ సదుపాయాలను ఏర్పాటు చేశాం’’ అని ఎన్టీఏ ప్రకటించింది. 

మరోవైపు కేరళ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రం స్పందిస్తూ.. ఈ తరహా మార్గదర్శకాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాల్ ప్రాక్టీసెస్ ను గుర్తించేందుకు టెక్నాలజీ ఉందని గుర్తు చేస్తూ.. అమానవీయ, అనాగరిక విధానాలకు బదులుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు.

More Telugu News