New Delhi: రూ. కోటి విలువైన డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మోడల్

  • నిందితులను శుభమ్ మల్హోత్రా, కీర్తిగా గుర్తింపు
  • హిమాచల్‌ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయం
  • పక్కా సమాచారంతో బేడీలు వేసిన పోలీసులు
Model Arrested With Drugs Worth 1 Crore In Delhi

ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నిన్న కోటి రూపాయలకుపైగా విలువైన 1.010 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల మోడల్‌ను, అతడి గాళ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ అతడి స్నేహితురాలు కీర్తి(27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రెండుమూడు రోజులు గడిపిన సన్నీ సింగు సరిహద్దు మీదుగా తన కారులో ఉదయం ఆరేడు గంటల సమయంలో ఢిల్లీ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

సింగు సరిహద్దు వద్ద కాపు కాసిన పోలీసులు అతడి కారును ఆపాలని ప్రయత్నించినా భారీ వర్షానికి తోడు అతడు అత్యంత వేగంగా దూసుకెళ్తుండడంతో ఆ పని చేయలేకపోయారు. దీంతో ఓ బృందం అతడి కారును అనుసరించగా, మరో బృందం అతడు నివసించే ఓల్డ్ గుప్తా కాలనీకి వెళ్లింది. 45 నిమిషాల ఛేజింగ్ తర్వాత ఓల్డ్ గుప్తా కాలనీలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 

2016లోనే తనకు ధూమపానం, డ్రగ్స్ అలవాటయ్యాయని, ఖర్చుల కోసం స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం ప్రారంభించానని పోలీసుల విచారణలో సన్నీ పేర్కొన్నాడు. ఇందులో పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్, మలానా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు చెప్పాడు. తనకు సాయంగా ఉండేందుకు స్నేహితురాలైన కీర్తిని కూడా ఇందులోకి దింపినట్టు చెప్పాడు.

More Telugu News